వెటర్నరీ కళాశాల సిద్దిపేటకేనా?

ABN , First Publish Date - 2021-06-22T04:46:24+05:30 IST

ముఖ్యమంత్రి ప్రకటించిన వెటర్నరీ కళాశాల కూడా సిద్దిపేటకేనా అని టీపీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌ జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని సిద్దిపేట దొరలకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. సోమవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న దుర్మార్గాలపై స్థానిక ఎమ్మెల్యే మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్య

వెటర్నరీ కళాశాల సిద్దిపేటకేనా?

మెదక్‌ ఆత్మగౌరవం సిద్దిపేటకు తాకట్టు

ఎమ్మెల్యే పద్మారెడ్డి మౌనం వహించడం సిగ్గుచేటు

హరీశ్‌ దుర్మార్గంపై ఇక ప్రత్యక్ష పోరు

టీపీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ

మెదక్‌, జూన్‌ 21 : ముఖ్యమంత్రి ప్రకటించిన వెటర్నరీ కళాశాల కూడా సిద్దిపేటకేనా అని టీపీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌ జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని సిద్దిపేట దొరలకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. సోమవారం మెదక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న దుర్మార్గాలపై స్థానిక ఎమ్మెల్యే మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట పర్యటనలో సిద్దిపేట, నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండకు వెటర్నరీ కళాశాలలు మంజూరు చేశారన్నారు. హార్టీకల్చర్‌ యూనివర్సిటీ, ఫారెస్టు యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాలతో సహా సిద్దిపేట, గజ్వేల్‌లో ఏర్పాటు చేస్తుంటే మెదక్‌ జిల్లాలోని మహిళా డిగ్రీ కళాశాలను మాత్రం నామరూపం లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా మంత్రి హరీశ్‌రావు కుట్రలో భాగమేనని విమర్శించారు. అలాగే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నాలుగు మల్టీస్పెషాల్టీ ఆసుపత్రులు కేవలం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. మెదక్‌లాంటి వెనుకబడిన ప్రాంతాలను దగా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో చేపడుతున్న రోడ్ల మరమ్మతులు, కలెక్టరేట్‌, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు, రైల్వే పనులు పడకేస్తుంటే సిద్దిపేట జిల్లాలోని పనులు మట్టుకు పరుగులందుకుంటున్నాయని విమర్శించారు. జిల్లా ప్రజలపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న మంత్రి హరీశ్‌రావు వైఖరిపై ఇక ప్రత్యక్ష పోరు తప్పదని ఆయన హెచ్చరించారు. పదవుల కోసం పాకులాడే స్థానిక ఎమ్మెల్యే తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇందుకు ప్రజాక్షేత్రంలో తప్పకుండా మూల్యం చెల్లిస్తుందని తెలిపారు.

Updated Date - 2021-06-22T04:46:24+05:30 IST