ప్రజా అవసరాలకు శుద్ధి చేయని మంజీరా జలాలా?
ABN , First Publish Date - 2021-10-29T04:52:34+05:30 IST
ప్రజా అవసరాలకు శుద్ధి చేయని మంజీరా జలాలను సరఫరా చేస్తున్నారంటూ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు మండిపడ్డారు.

సర్వసభ్య సమావేశంలో సభ్యుల మండిపాటు
పుల్‌కల్, అక్టోబరు 28 : ప్రజా అవసరాలకు శుద్ధి చేయని మంజీరా జలాలను సరఫరా చేస్తున్నారంటూ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు మండిపడ్డారు. పుల్కల్ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గాజుల వీరేందర్ అధ్యక్షతన గురువారం సర్వసభ్య సమావేశం జరిగింది. పెద్దారెడ్డిపేట హున్నాపూర్ గ్రామాల్లో కోట్లు వెచ్చించి నిర్మించిన మిషన్ భగీరథ తాగునీరు పథకాల నిర్వహణ సక్రమంగా లేదని ఆరోపించారు. నీటి శుద్ధికి అవసరమైన ఆలం, లిక్విడ్ క్లోరిన్ వంటి వాటిని ఉపయోగించడం లేదన్నారు. సింగూరు, మంజీరా జలాశయాల్లోని నిల్వ నీటిని పంపింగ్ చేసి, అదే నీటిని శుద్ధి చేయకుండానే ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ లక్ష్మీప్రసాద్ స్పందిస్తూ నీటి శుద్ధి కేంద్రాలను సందర్శిస్తామని తెలిపారు. శివంపేట బీరు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కో ఆప్షన్ సభ్యుడు ఎంఇ.అలీం సభ దృష్టికి తీసుకురా, చౌటకూర్ నయాబ్ తహసీల్దార్ మహేశ్‌కుమార్ స్పందిస్తూ వారి వార్షికాదాయాన్ని పరిశీలించి అర్హులైన కార్మికులకు రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని హామీఇచ్చారు. యాసంగిలో వరి సాగు వద్దంటూ ప్రభుత్వాధికారులు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ సభ్యులు కిరణ్‌గౌడ్, దిగోల దుర్గయ్య, రాజిరెడ్డి ప్రశ్నించారు. గంజాయి సాగుచేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని జోగిపేట సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పరమేశం, చౌటకూర్ నయాబ్ తహసీల్దార్ మహేశ్‌కుమార్, ఎంపీడీవో మధులత, పీఆర్ ఏఈఈ శశికుమార్, కార్యాలయ పర్యవేక్షకులు శాకీర్‌అలీ, సర్పంచుల ఫోరం ఉమ్మడి మండలాధ్యక్షుడు బక్కారెడ్డి కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.