ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST
ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశకు ఇంటర్మీడియట్ ఒక మలుపు అని, అందుకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కరోనా కలకలం నేపథ్యంలో సుదీర్ఘ విరామం అనంతరం పరీక్షలు
కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలి
పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు తనిఖీ చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం
మెదక్ అర్బన్/సంగారెడ్డి రూరల్, అక్టోబరు 21: ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం ఆమె కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశకు ఇంటర్మీడియట్ ఒక మలుపు అని, అందుకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కరోనా కలకలం నేపథ్యంలో సుదీర్ఘ విరామం అనంతరం పరీక్షలు నిర్వహిస్తున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సీసీ కెమెరాలు ఫర్నీచర్ ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్–19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కేంద్రాలను ప్రతీరోజు శానిటైజ్ చేయాలని, విద్యార్థులకు థర్మల్ స్ర్కీనింగ్ చేసి జ్వర లక్షణాలున్నవారికి ప్రత్యేక గదిని కేటాయించాలని సూచించారు. ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్ అందుబాలో ఉంచాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని సూచించారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు వచ్చేలా బస్సులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న సిబ్బందితో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. తమకు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు స్వయంగా తనిఖీ చేయాలని సూచించారు. అన్ని జాగ్రత్తలతో పరీక్షలను నిర్వహిస్తున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం
సంగారెడ్డి జిల్లాలో పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ హన్మంతరావు మంత్రికి తెలిపారు. జిల్లాలో 54 సెంటర్లలో, 16,255 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. పరీక్షల పత్రాలను నిల్వ చేసేందుకు 18 స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేశామని, 54 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 20 మంది అదనపు చీఫ్ సూపరింటెండెంట్‌లు 54 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, మూడు ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేశామని, ప్రతీ సెంటర్‌లో సీసీకెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కల్టెకర్ ప్రతిమసింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 34 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలకు 7,211 మంది విద్యార్థులు హాజరవుతారని తెలియజేశారు. పరిక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని, అన్నికేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చామని వివరించారు. మెదక్ జిల్లా నుంచి నోడల్ అధికారి సత్యనారాయణ, డీఈవో రమేష్, ఆర్డీవో సాయిరాం తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి గోవింద్‌రామ్, అధికారులు పాల్గొన్నారు.