ప్రపంచానికే భారత్‌ ఆదర్శం : మురళీధర్‌రావు

ABN , First Publish Date - 2021-02-24T05:31:56+05:30 IST

ప్రపంచ దేశాలకు భారత దేశం ఆదర్శంగా నిలుస్తున్నదని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు.

ప్రపంచానికే భారత్‌ ఆదర్శం : మురళీధర్‌రావు
విజేతలకు బహుమతులను అందజేస్తున్న మురళీధర్‌రావు

జహీరాబాద్‌, ఫిబ్రవరి 23: ప్రపంచ దేశాలకు భారత దేశం ఆదర్శంగా నిలుస్తున్నదని బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో దేశ ఐక్యత కోసం సర్వమత ప్రార్థనలు, ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్నివర్గాలు కలిసిమెలసి ఉంటూ దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెబుతున్నారని కొనియాడారు. కరోనా విపత్తు సమయంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయినా ప్రధాని నరేంద్రమోదీ పిలుపుమేరకు బీజేపీ శ్రేణులు ప్రజలను ఆదుకున్నాయని ఆయన గుర్తు చేశారు. వ్యాక్సిన్‌ తయారీకి అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రధాని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని కృషితో అతిస్వల్ప కాలంలోనే దేశీయంగా కరోనా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయడమేకాకుండా ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతిక, విద్యా, వైద్య రంగాల్లో మనదేశం ప్రపంచంలోనే ముందువరుసలో ఉందని కొనియాడారు. జహీరాబాద్‌ ప్రాంతంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జంగం గోపీ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ఆయన అభినందించారు.  అనంతరం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జంగం గోపి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జహీరాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల్లో విజయం సాధించిన జట్లకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులురాములు, చింతా సాంబమూర్తి, శ్రీవర్ధన్‌రెడ్డి, దేశ్‌పాండే, నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-24T05:31:56+05:30 IST