పెరిగిన నేరాలు.. తగ్గని ఘెరాలు

ABN , First Publish Date - 2021-12-31T05:23:02+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణ కత్తిమీద సాము అయినప్పటికీ దాన్ని సవాలుగా స్వీకరించిన జిల్లా పోలీసులు సాంకేతికత, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందుకుసాగుతూ నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు.

పెరిగిన నేరాలు.. తగ్గని ఘెరాలు
అల్లాదుర్గం మండలం చిల్వర్‌ వద్ద 161వ జాతీయ రహదారిపై అక్టోబరు 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందిన దృశ్యం (ఫైల్‌)

కలవరపెడుతున్న రోడ్డు ప్రమాదాలు

వార్షిక నివేదిక విడుదల చేసిన మెదక్‌ జిల్లా పోలీసులు 

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 30 : శాంతిభద్రతల పరిరక్షణ కత్తిమీద సాము అయినప్పటికీ దాన్ని సవాలుగా స్వీకరించిన జిల్లా పోలీసులు సాంకేతికత, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందుకుసాగుతూ నేరాలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో ఏడాదికాలంగా మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టగా, రోడ్డు ప్రమాదాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, కిడ్నాప్‌, చీటింగ్‌, మిస్సింగ్‌ కేసులు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3,892 నేరాలు జరగగా హత్యలు 25, ఆస్తికోసం హత్యలు 6, కిడ్నా్‌పలు 29, అత్యాచారాలు 46, దోపిడీలు 2, పగటి దొంగతనాలు 11, రాత్రి దొంగతనాలు 99, ఇతర దొంగతనాలు 167, గొలుసు దొంగతనాలు 11, మోసాలు 129 జరిగాయి. ఈ నేరాల్లో రూ.కోటి 3 లక్షల 73 వేల 554 రూపాయల సొత్తు దొంగతానికి గురికాగా రూ.30 లక్షల 12 వేల 50 రూపాయలను పోలీసులు రికవరీ చేశారు. అంటే 29.04 శాతం రికవరీ జరిగింది. డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఈ ఏడాదిలో 1,365 మంది మందుబాబులపై కేసులు నమోదుచేశారు. ఈ ఏడాది 15 సైబర్‌ నేరాలు, గుట్కాకు సంబంధించి 60, ఇసుక అక్రమ రవాణా 153, కల్తీ విత్తనాలు 5, పేకాట 47 కేసులు నమోదుకాగా 288 మందిని అరెస్టు చేశారు. 8.71 లక్షల సొత్తును రికవరీ చేశారు. 

రోడ్డు ప్రమాదాలు

గతేడాది 458 రోడ్డు ప్రమాదాలు జరిగి 275 మంది మరణించగా 467 మందికి గాయాలయ్యాయి. ఈ సంవత్సరం 463 రోడ్డు ప్రమాదాలు జరిగి 283 మంది మరణించగా 386 మందికి గాయాలయ్యాయి. గతేడాదికంటే 5 ప్రమాదాలు అధికంగా జరిగాయి. వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు పోలీసు రికార్డులకంటే రెట్టింపుగా ఉంటాయి. చిన్నచిన్న ప్రమాదాలను పోలీసులు నమోదు చేయలేదు. బాధితులు ఫిర్యాదు చేయడం లేదు. మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించి షీటీంలతో పకడ్పందీ చర్యలను అమలుచేస్తున్నారు. జిల్లాలో గతేడాది మహిళలపై 297 నేరాలు జరగగా, ఈ ఏడాది 333 జరిగాయి. 

సాంకేతికతో నేరాలను అరికడుతాం

కొత్త సంవత్సరంలో మరింత పకడ్బందీగా సాంకేతికతను ఉపయోగించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర కృషి కొనసాగుతుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు అమలుచేస్తాం. మహిళల  రక్షణకు పకడ్బందీ చర్యలు ఉంటాయి. జిల్లాలో వందశాతం సీసీ కెమెరాల ఏర్పాటును త్వరలోనే పూర్తి చేస్తాం. 

- రోహిణి ప్రియదర్శిని, జిల్లా ఎస్పీ

Updated Date - 2021-12-31T05:23:02+05:30 IST