నేనూ కరోనా బాధితుడినే !

ABN , First Publish Date - 2021-05-20T05:56:47+05:30 IST

‘నాకు కూడా కరోనా వచ్చింది. కానీ భయపడలేదు. డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటూ మనోధైర్యంతో ఉన్నాను. పది రోజులు ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నాను. మన గుండెధైర్యం చెడితే ఇబ్బంది పడతాం. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు వేస్తూ.. మంచి ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఆస్పత్రులకు వచ్చినా నిబ్బరంగా ఉండాలి. ఆందోళన పడితే ఆరోగ్యానికే ప్రమాదం.’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు కరోనా పేషెంట్లకు భరోసా కల్పించారు.

నేనూ కరోనా బాధితుడినే !
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా వార్డును సందర్శించి రోగులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి

మనోధైర్యంతో కోలుకున్నా

కొవిడ్‌ పేషెంట్లతో మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట ఆస్పత్రిలోని కరోనా వార్డుల సందర్శన

కలెక్టర్‌తో కలిసి కలియతిరిగిన మంత్రి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే19 : ‘నాకు కూడా కరోనా వచ్చింది. కానీ భయపడలేదు. డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుంటూ మనోధైర్యంతో ఉన్నాను. పది రోజులు ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నాను. మన గుండెధైర్యం చెడితే ఇబ్బంది పడతాం. శ్వాసకు సంబంధించిన యోగాసనాలు వేస్తూ.. మంచి ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ఆస్పత్రులకు వచ్చినా నిబ్బరంగా ఉండాలి. ఆందోళన పడితే ఆరోగ్యానికే ప్రమాదం.’ అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు కరోనా పేషెంట్లకు భరోసా కల్పించారు. 

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా వార్డును కలెక్టర్‌ వెంకట్రామారెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు బుధవారం రాత్రి సందర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులతో మాట్లాడారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, ఆహారంపై వారినే అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 మంది పేషెంట్ల వద్దకు వెళ్లి మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష చేపట్టారు. 


పేషెంట్లు సంతృప్తిగా ఉన్నారు

మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పేషెంట్లు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఆక్సిజన్‌ కొరత లేదని, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు సమయానికి ఇస్తున్నారని, మంచి ఆహారం పెడుతున్నారని పేషెంట్లే చెప్పినట్లు వివరించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటివరకు 705 మందికి కరోనా చికిత్స పొంది ఆరోగ్యంతో ఇంటికి వెళ్లారని తెలిపారు. ఇక్కడ 4,192 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఉచితంగా అందించినట్లు పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రస్తుతం 235 బెడ్లు ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 2,26,394 ఇళ్లను ఇంటింటి సర్వే చేపట్టగా 7,463 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. అక్కడే వారికి కొవిడ్‌ కిట్లు అందజేసినట్లు వివరించారు. గ్రామస్థాయిలోనే వారిని ఐసోలేషన్‌ చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. వారందరికీ ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు 5,15,378 మందికి కరోనా టెస్టులు చేయగా 31 వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. అన్ని పీహెచ్‌సీల్లో పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వెల్లడించారు. ప్రధాన మంత్రి సైతం ఈ సర్వేను దేశవ్యాప్తంగా నిర్వహించేలా పిలుపునిచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 3 లక్షల మందికి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. రెండో రౌండ్‌ కూడా చేపట్టనున్నారని వివరించారు. కేంద్రం నుంచి కొవాగ్జిన్‌ టీకాలు రావడం లేదని చెప్పారు. ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నట్లు వివరించారు. 


సిద్దిపేటకు నర్సింగ్‌ కళాశాల మంజూరు..

సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వెయ్యి పడకలతో ఇక్కడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఉన్నందున.. నిరంతరం సేవలందించడానికి నర్సులు కూడా అందుబాటులో ఉండాలని అన్నారు. అందుకే వచ్చే విద్యాసంవత్సరం నుంచి నర్సింగ్‌ కళాశాల ప్రారంభమవుతుందని వెల్లడించారు. మెడికల్‌ కళాశాలలో ఫైనలియర్‌ చదివే 150 మంది వైద్యులతోపాటు వందలాది మంది నర్సులు ఇకపై సిద్దిపేటలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-20T05:56:47+05:30 IST