ఉల్లంఘిస్తే.. ఊరుకోం

ABN , First Publish Date - 2021-12-29T05:06:42+05:30 IST

రోడ్డు నిబంధనల ఉల్లంఘన కేసుల్లో వాహనదారులకు చలాన్ల మోత మోగుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.

ఉల్లంఘిస్తే.. ఊరుకోం

  రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే ఇంటికే చలాన్‌


చిన్నకోడూరు, డిసెంబరు 28: రోడ్డు నిబంధనల ఉల్లంఘన కేసుల్లో వాహనదారులకు చలాన్ల మోత మోగుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుంతుందని పదే పదే పోలీసులు అవగాహన కల్పిస్తున్నా నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిరంతరం స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా వాహనాలను తనీఖీ చేస్తూ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు.


ఆన్‌లైన్‌ ద్వారా ఈ- చలాన్లు 


ఒకప్పడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే పోలీసులు వాహనాలు ఆపి చలాన్లు విధించి రశీదు ఇచ్చేవారు. ప్రస్తుతం నూతన టెక్నాలజీతో సెల్‌ ఫోన్లు, ట్యాబులు వాడుతున్న పోలీసులు ట్రాఫిక్‌ నియమాలు పాటించని వాహనాల ఫొటోలు తీసి ఆన్‌లైన్‌ ద్వారా ఈ- చలాన్లు విధిస్తున్నారు. వాహనం నంబరు ఆధారంగా ఆర్‌సీపై ఉన్న చిరునామాకు చలాన్లు పంపుతున్నారు. అంతే కాకుండా ఆర్‌సీలో రిజిస్టర్‌ అయిన ఫోన్‌ నంబరుకు ఫైన్‌ పడినట్లు  మెసేజ్‌ కూడా పంపుతున్నారు. పోలీసులు వాహనాన్ని తనిఖీ కోసం ఆపినప్పుడు అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లను ఆన్‌లైన్‌ ద్వారానే కట్టిస్తున్నారు. 


చిన్నకోడూరు స్టేషన్‌ పరిధిలో 1,150 కేసులు


చిన్నకోడూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 26 వరకు 1,150 కేసులు నమోదు కాగా రూ.4,66,480 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడిపినా, ఫోన్‌ మాట్లాడుతూ నడిపినా, రాంగ్‌ రూట్‌లో వెళ్లినా, వాహనానికి ఇన్సూరెన్స్‌, నంబరు ప్లేట్‌ లేకున్నా, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌ లేకున్నా, ఓవర్‌లోడ్‌తో వెళ్లినా, మైనర్లు వాహనాలు నడిపినా, ర్యాష్‌ డ్రైవింగ్‌, బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌ చేసినా చలాన్లు విధిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘన కేసుల్లో కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.2 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. కొన్ని కేసుల్లో జరిమానాలే కాకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


 

Updated Date - 2021-12-29T05:06:42+05:30 IST