ప్రమాదాలకు బ్రేక్‌ పడేదెట్లా?

ABN , First Publish Date - 2021-12-15T05:30:00+05:30 IST

మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో జిగేల్‌మంటున్న 161వ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనచోదకులు గేర్లు మార్చకుండా, బ్రేక్‌పై కాలు పెట్టకుండా వెళ్లొచ్చు. అంతటి విశాలమయిన ఈ రోడ్డుపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి.

ప్రమాదాలకు బ్రేక్‌ పడేదెట్లా?
చిల్వర్‌ వద్ద బోల్తా పడిన కారు (ఫైల్‌)

అల్లాదుర్గం, డిసెంబరు 15: మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో జిగేల్‌మంటున్న 161వ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనచోదకులు గేర్లు మార్చకుండా, బ్రేక్‌పై కాలు పెట్టకుండా వెళ్లొచ్చు. అంతటి విశాలమయిన ఈ రోడ్డుపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి.  రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు చర్యలు చేపడుతూ, ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా ఈ ప్రమాదాలకు బ్రేక్‌ పడడం లేదు. 

అల్లాదుర్గం మండలంలోని సుమారు 25 కిలోమీటర్ల దూరం వరకు 161వ జాతీయ రహదారి ఉంది. నాలుగు లేన్ల రోడ్డుతో పాటు, పలు గ్రామాల నుంచి ఈ రహదారి గుండా ప్రయాణించేందుకు రెండు వైపుల సర్వీస్‌ రోడ్డును సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎంతో విశాలమైన ఈ రోడ్డుపై తరచూ ఏదో ఒక చోట ప్రమాదాలకు సంబంధించిన వార్త ఈ ప్రాంత ప్రజలు వినాల్సి వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఈ నెల 13 వరకు అల్లాదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 10 రోడ్డు ప్రమాదాలు జరగగా 9 మంది చనిపోయారు. మరో 9 మంది గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈ లెక్కలు కేవలం పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదైనవి మాత్రమే. కానీ ఈ రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికి బాధితులు పోలీసులను ఆశ్రయించకుండానే ఆస్పత్రిలో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. అత్యధికంగా గడిపెద్దాపూర్‌-ముస్లాపూర్‌ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. అక్టోబరు 3న మండలంలోని చిల్వర్‌ వద్ద ఆటో, బైక్‌ ఢీ కొనడంతో దంపతులు మృతి చెందడం.. ఈ వాహనాల వేగం ఏ తీరులో ఉందో స్పష్టమవుతుంది. ఈ నెల 10న గడిపెద్దాపూర్‌ శివారులో కారు బోల్తా పడి ఇద్దరు మరణించగా, ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. బైక్‌లు అదుపుతప్పిన వేర్వేరు ప్రమాదాల్లో మరో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలు కేవలం మూడున్నర నెలల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-12-15T05:30:00+05:30 IST