అమ్మో.. హైవే 44
ABN , First Publish Date - 2021-08-26T04:36:37+05:30 IST
వర్షాకాలంలో హైవే–44 (హైదరాబాద్–నాగ్‌పూర్ రోడ్డు)పై ప్రయాణం అంటేనే ప్రయాణికులు బయపడుతున్నారు. వర్షం కురిసిన ప్రతీసారి రామాయపల్లి అండర్‌పాస్ ఆర్‌యూబీలోకి వర్షపు నీరు చేరడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జాం ఏర్పడుతున్నది. భారీ వాహనాలు ముందుకుపోలేక అక్కడే నిలిచిపోగా, చిన్న వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గతేడాది కూడా పలుమార్లు ఇదే పరిస్థితి తలెత్తింది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వాల్సిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు కళ్లు తెరవకపోవడంతో మరోసారి పరిస్థితి పునరావృతమవుతున్నది. నిర్మాణంలో లోపాలు

నాగపూర్ హైవేపై ప్రయాణికులకు నరకం
రామాయపల్లి వద్ద ఆర్‌యూబీలోకి వర్షపు నీరు
వాహనాల రాకపోకలకు ఆటంకం
గంటల తరబడి ట్రాఫిక్ జాం
పది కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
గతేడాది అనుభవాలతో పాఠాలు నేర్వని భారత జాతీయ రహదారుల సంస్థ
తూప్రాన్, ఆగస్టు 25: వర్షాకాలంలో హైవే–44 (హైదరాబాద్–నాగ్‌పూర్ రోడ్డు)పై ప్రయాణం అంటేనే ప్రయాణికులు బయపడుతున్నారు. వర్షం కురిసిన ప్రతీసారి రామాయపల్లి అండర్‌పాస్ ఆర్‌యూబీలోకి వర్షపు నీరు చేరడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జాం ఏర్పడుతున్నది. భారీ వాహనాలు ముందుకుపోలేక అక్కడే నిలిచిపోగా, చిన్న వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గతేడాది కూడా పలుమార్లు ఇదే పరిస్థితి తలెత్తింది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వాల్సిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు కళ్లు తెరవకపోవడంతో మరోసారి పరిస్థితి పునరావృతమవుతున్నది.
నిర్మాణంలో లోపాలు
కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద హైవే–44పై అండర్‌పాస్ నిర్మించారు. రూ.109 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. రైల్వేలైన్ కోసం ముందస్తుగా అండర్‌పాస్ నిర్మించారు. నిర్మాణ లోపం కారణంగా వర్షం కురిసిన ప్రతీసారి ఆర్‌యూబీలో నీరుచేరి వాహన రాకపోకలు నిలిచిపోతున్నాయి. గతేడాది జూన్ 27న రాత్రి కురిసిన వర్షానికి అండర్‌పాస్ ఆర్‌యూబీలోకి నీరు చేరి ప్రయాణం నిలిచిపోగా, రైల్వేట్రాక్ సైతం దెబ్బతిన్నది. ఆ తరువాత కూడా పలుమార్లు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలికంగా మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తోడేసి రాకపోకలను కొనసాగించారు. శాశ్వత ఏర్పాట్లు చేయకపోవడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి అండర్‌పాస్ ఆర్‌యూబీలోకి నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. హైవేపై ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మేడ్చల్ వద్ద ట్రాఫిక్‌ను రాజీవ్ రహదారి మీదకు మళ్లించారు. బుధవారం 9 మోటార్లతో నీటిని తొలగించారు. వర్షం కురిసిన ప్రతీసారి సమస్య ఎదురవుతున్నా సంబంధిత అధికారులు కళ్లు తెరవకపోవడంపై ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.