ఇరుకు రోడ్డు.. ఇంకెనాళ్లు?

ABN , First Publish Date - 2021-08-21T06:02:46+05:30 IST

మెదక్‌–సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారిని నేషనల్‌ హైవేగా గుర్తిస్తున్నట్టు 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. జాతీయ రహదారుల అనుసంధానంలో భాగంగా ఈ రహదారిని అభివృద్ధి చేస్తామని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాలుగు వరుసలతో కొత్త రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేపడతామని, భూసేకరణ, నిధుల అంచనాపై నివేదిక తయారు చేస్తామని పేర్కొన్నది. ఐదేళ్లయినా అడుగు ముందుకు పడలేదు.

ఇరుకు రోడ్డు.. ఇంకెనాళ్లు?
సిద్దిపేట, హుస్నాబాద్‌ రహదారి

కాగితాల్లోనే మెదక్‌–ఎల్కతుర్తి రహదారి

ఊరిస్తున్న పెద్దరోడ్డు!

జాతీయ రహదారిగా ప్రకటించినా జాప్యమే!

133 కిలోమీటర్ల విస్తరణకు ఐదేళ్ల క్రితం ప్రతిపాదనలు

ప్రకటనలు, సర్వేలకే పరిమితం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 20: మెదక్‌–సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారిని నేషనల్‌ హైవేగా గుర్తిస్తున్నట్టు 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. జాతీయ రహదారుల అనుసంధానంలో భాగంగా ఈ రహదారిని అభివృద్ధి చేస్తామని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నాలుగు వరుసలతో కొత్త రోడ్డు నిర్మాణం కోసం సర్వే చేపడతామని, భూసేకరణ, నిధుల అంచనాపై నివేదిక తయారు చేస్తామని  పేర్కొన్నది. ఐదేళ్లయినా అడుగు ముందుకు పడలేదు.


133 కిలోమీటర్లు కొత్త రోడ్డు

మెదక్‌ నుంచి రామాయంపేట–సిద్దిపేట–హుస్నాబాద్‌ మీదుగా ఎల్కతుర్తి వరకు 133 కిలోమీటర్ల రహదారిని నేషనల్‌ హైవేగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మెదక్‌–భైంసా రహదారికి కూడా జాతీయ హోదా కల్పించడంతో దానికి అనుసంధానిస్తూ మెదక్‌–ఎల్కతుర్తి రోడ్డును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ రహదారి రామాయంపేట వద్ద హైదరాబాద్‌–నాగపూర్‌ హైవేను, సిద్దిపేటలో హైదరాబాద్‌–కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిని కూడా కలుపుతూ.. ఎల్కతుర్తి జంక్షన్‌ వద్ద వరంగల్‌–కరీంనగర్‌ ప్రధాన రహదారిలో కలుస్తుంది. నాలుగు ప్రధాన రహదారులను అనుసంధానించే ఈ హైవే పనులకు మోక్షం కలగడం లేదు. 


దశాబ్దాలుగా మారని రోడ్డు

ఎల్కతుర్తి, హుజూరాబాద్‌, జమ్మికుంట, హుస్నాబాద్‌ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి ఈ రోడ్డు గుండా.. సిద్దిపేటకు మీదుగా ప్రయాణం చేస్తారు. కొంతకాలం క్రితం డబుల్‌ రోడ్డు నిర్మాణం చేసినప్పటికీ వాహనాల రద్దీ పెరగడంతో ఇరుకుగా మారింది. మరోవైపు మెదక్‌–సిద్దిపేట రహదారిపై ప్రయాణం అనగానే వాహనదారులు నీరసించిపోతారు. ఉమ్మడి జిల్లాకేంద్రమైన సంగారెడ్డికి ఈ మార్గంలో మాత్రమే బస్సు నడుస్తుంది. మెదక్‌ పట్టణానికి వెళ్లడానికి కూడా ఇదే ప్రధాన మార్గం. ఈ రహదారి సరిగ్గా లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రహదారుల కనెక్టివిటీ అవసరం కావడంతో ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 


మరమ్మతులకే పరిమితం

జాతీయ రహదారి హోదా ఇచ్చినా మెదక్‌–ఎల్కతుర్తి రహదారి పరిస్థితి మెరుగుపడలేదు. ఈ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని ప్రతిపాదించినా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. పాత రోడ్డు శిథిలంకావడంతో అప్పుడప్పుడు మరమ్మతులు చేస్తున్నారు. గత వర్షాకాలంలో సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. అక్కడక్కడ రోడ్డు కోతకు గురయ్యింది. కొద్ది రోజులకు మరమ్మతులు చేపట్టినా ప్రస్తుతం వర్షాలకు మళ్లీ అదే స్థితికి చేరుకున్నది. కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద వాగుపై బ్రిడ్జి వర్షాలకు మునిగిపోయి రాకపోకలకు తరచుగా అంతరాయం ఏర్పడుతున్నది. ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మించాల్సి ఉండగా.. జాతీయ రహదారిగా ప్రకటించడంతో వాయిదా వేశారు. ఈ రహదారి పనులను త్వరగా ప్రారంభించాలని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పలుమార్లు కేంద్ర మంత్రులకు, ఉన్నతాధికారులను కలిసి విన్నవించారు. కానీ పనులు మాత్రం ఇప్పట్లో మొదలయ్యే దాఖలాలు కనిపించడం లేదు.

Updated Date - 2021-08-21T06:02:46+05:30 IST