బిందుసేద్యంతో అధిక దిగుబడులు
ABN , First Publish Date - 2021-12-10T04:43:43+05:30 IST
బిందుసేద్యంతో అధిక దిగుబడులు సాధించొచ్చని అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్ రైతులకు సూచించారు.

అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్
జగదేవ్‌పూర్, డిసెంబరు 9: బిందుసేద్యంతో అధిక దిగుబడులు సాధించొచ్చని అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్ రైతులకు సూచించారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామలైన ఎర్రవల్లి, నరసన్నపేటలో నెటాఫిమ్ ఇరిగేషన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో సాగయిన సమీకృత బిందుసేద్య పంటలపై ఎలాంటి లాభాలు పొందుతున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు. నరసన్నపేటలో సాగవుతున్న పూలు, కూరగాయలు, పండ్ల తోటలను, అలిరాజ్‌పేట్‌లో పట్టు పురుగుల పెంపకం, మల్బరీ తోటలను గురువారం సాయంత్రం ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, నెటాఫిమ్ కంపెనీ ప్రతినిధి సుబ్బారావుతో కలిసి పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రతీ నీటి చుక్కను సద్వినియోగం చేసుకుంటున్న మార్గమే బిందు సేద్యం అని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం గురించి ఆరా తీశారు.