కమ్ముకున్న ముసురు

ABN , First Publish Date - 2021-07-12T05:37:47+05:30 IST

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ముసురు కమ్ముకున్నది. అల్పపీడన ప్రభావంతో పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

కమ్ముకున్న ముసురు

 సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో    శనివారం రాత్రి నుంచి ముసురు   కమ్ముకున్నది. అల్పపీడన ప్రభావంతో పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టులు, చెరువులు, వాగులు జలకళను సంతరించుకున్నాయి. నల్లవాగు అలుగు పారగా, సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. పిడుగుపాటుతో కల్హేరు మండలంలో వరినాట్లు వేస్తున్న మహిళా కూలీ మృతి చెందింది.

సంగారెడ్డి/నారాయణఖేడ్‌/కల్హేర్‌/కోహీర్‌, జూలై 11: సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్‌, కోహీర్‌ తదితర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి ముసురుతో కూడిన వర్షం కురిసింది. నారాయణఖేడ్‌ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కొంత సేపు భారీ వర్షం కురిసింది. వరదనీరు ఖేడ్‌ పట్టణంలోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రహదారులపై నుంచి పారడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మధ్య నుంచి వరదనీరు పారడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సరఫరాకు కొంతసేపు అంతరాయం కలిగింది. షెట్కార్‌ థియేటర్‌ రోడ్డులో నీరు భారీగా నిలవడంతో ఆ ప్రాంతం నీటి మడుగును తలపించింది. 


పిడుగుపాటుతో  మహిళా కూలీ మృతి

సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండల పరిధిలోని మార్డి గ్రామంలో వరి నాట్లు వేయడానికి తోటి కూలీలతో కలిసి వెళ్లిన మహిళా కూలీ పిడుగుపాటుకు గురై మృతిచెందింది. మార్డి గ్రామానికి చెందిన లొద్ద గంగవ్వ(55) తోటి కూలీలతో కలిసి ఆదివారం ఉదయం అదే గ్రామానికే చెందిన కంట్రోపల్లి పెంటయ్య అనే రైతు పొలంలో నాట్లు వేయడానికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో నాట్లు వేస్తుండగా పిడుగుపాటుకు గురి కావడంతో అక్కడికక్కడే కుప్పకూలింది. తమతో పాటు వచ్చి పిడుగుపాటుకు గంగవ్వ మృతిచెందడం పట్ల తోటి కూలీలు కన్నీరుమున్నీరయ్యారు. గంగవ్వకు భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. నిరుపేద అయిన గంగవ్వ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కల్హేర్‌ ఎంపీపీ గుర్రపు సుశీల, మార్డి సర్పంచ్‌ లక్ష్మీనారాయణ కోరారు. అయితే మరికొంత మంది కూలీలు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. 


కోహీర్‌ మండలంలో విస్తారంగా వర్షాలు

కోహీర్‌తో పాటు మండల పరిధిలోని బిలాల్‌పూర్‌, మనియర్‌పల్లి, బడంపేట, దిగ్వాల్‌, కవేలి, పైడిగుమ్మల్‌, నాగిరెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో నాలుగు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండలంలోని చెరువుల్లో, వాగుల్లో కుంటల్లో వర్షపు నీరు చేరుతుంది. జూన్‌ మాసంలో 11.8 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 16.8 సెంటీమీటర్లు పడింది. జూలై 10వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 6.5 సెంటీమీటర్ల వర్షం నమోదుకావాల్సి ఉండగా 15.1 సెంటీమీటర్ల వర్షం పడింది.


అలుగు పారిన నల్లవాగు 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన సిర్గాపూర్‌ మండలంలోని నల్లవాగు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆదివారం తెల్లవారుజామున అలుగుపై నుంచి పొంగిపొర్లింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,493 అడుగులు కాగా రెండు రోజులుగా ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షాలకు శనివారం 1,491 అడుగుల ఉన్న నీటిమట్టానికి చేరుకున్నది. ఆదివారం తెల్లవారుజామున పూర్తిస్థాయికి చేరుకుని అలుగుపై నుంచి పొంగిపొర్లినట్లు నీటి పారుదల శాఖ ప్రాజెక్టు ఏఈ సూర్యకాంత్‌ తెలిపారు. ప్రాజెక్టు ఎగువ భాగంలోని కర్ణాటక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు 2,500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో వస్తుండగా 2,200 క్యూసెక్కుల వరద నీరు అవుట్‌ఫ్లోగా నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అనంతరం నెలరోజులకే ప్రాజెక్టు అలుగు పారడం ప్రాజెక్టు చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆయకట్టు రైతులు తెలిపారు. 




మెదక్‌ జిల్లాలో 

మెదక్‌ : మెదక్‌ జిల్లాలో శనివారం రాత్రి నుంచి సన్నని తుంపర్లతో కూడిన వర్షం కురిసింది. పాపన్నపేట, టేక్మాల్‌, హవేళీఘనపూర్‌, రేగోడ్‌ తదితర మండలాల్లో 2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్‌, రామాయంపేట, అల్లాదుర్గం, నార్సింగ్‌, వెల్దుర్తి, మండలాల్లో  సెంటీమీటర్‌కుపైగా వర్షం కురిసింది. మిగితా మండలాల్లో వర్షం కురియనప్పటికీ ఆకాశం మేఘావృతం అయింది. 


సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఆదివారం ఉదయం నాటికి 3,453 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. ప్రాజెక్టుకు ఎగువన గల మంజీరనది తీర ప్రాంతంలోని రేగోడు, వట్‌పల్లి, మనూరు, నాగల్‌గిద్ద, న్యాల్‌కల్‌, రాయికోడ్‌, జహీరాబాద్‌, కోహీర్‌, మునిపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు గడిచిన నాలుగు రోజుల నుంచి 7,983 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా 523.600 మీటర్లు. ఆదివారం ఉదయం నాటికి 520.808 మీటర్లకు 17.585 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. వరద నీటి ప్రవాహం మొదలవడంతో ప్రాజెక్టును తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.  

Updated Date - 2021-07-12T05:37:47+05:30 IST