హరీశ్‌రావు చేతికి ఆరోగ్య శాఖ

ABN , First Publish Date - 2021-11-10T05:16:13+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను అప్పగిస్తూ సీఎం కేసీఆర్‌ మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న హరీశ్‌రావు వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

హరీశ్‌రావు చేతికి ఆరోగ్య శాఖ
సిద్దిపేట ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న హరీశ్‌రావు (ఫైల్‌)

అదనపు బాధ్యతల అప్పగింత  

ఇప్పటివరకు ఎనిమిది శాఖలకు అమాత్యుడిగా విధులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, నవంబరు 9: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను అప్పగిస్తూ సీఎం కేసీఆర్‌ మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న హరీశ్‌రావు వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎంపికయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో హరీశ్‌రావు యువజన సర్వీసులు, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖకు మంత్రిగా విధులు నిర్వహించారు. నాడు కేసీఆర్‌ చొరవతో మంత్రి పదవి చేపట్టి సమర్థవంతంగా పనిచేశారు. అనంతరం కొద్దిరోజులకే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 32 ఏళ్ల వయస్సులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు శాఖలకు అమాత్యుడిగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. 


ఏడు శాఖల అనుభవం

2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టగానే క్యాబినెట్‌ మంత్రిగా హరీశ్‌రావుకు మూడు శాఖలను కేటాయించారు. తెలంగాణలోనే ఎంతో కీలకమైన నీటిపారుదల శాఖతోపాటు మార్కెటింగ్‌, భూగర్భగనులు, శాసనసభా వ్యవహారాల శాఖలను ఆయన పర్యవేక్షించారు. కొద్దిరోజుల అనంతరం పనిభారం తగ్గించడానికి భూగర్భగనుల శాఖను వదులుకున్నారు. 2018 సెప్టెంబరులో అసెంబ్లీ రద్దయ్యే వరకు సుమారు నాలుగున్నరేళ్ల పాటు సమర్థంగా పనిచేసి మూడు శాఖల స్థితిగతులు మార్చారు. నీళ్ల మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. మిషన్‌కాకతీయతో చెరువులకు జీవం పోశారు. మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా రాష్ట్రమంతటా పెద్దసంఖ్యలో గోదాములు, రైతుబజార్లు, మార్కెట్లను నిర్మించడం ద్వారా అన్నదాతలకు అండగా నిలిచారు. శాసనసభనూ తనదైన శైలిలో నిర్వహించారు. 2019 సెప్టెంబర్‌ నెలలో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం కొత్త ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టారు.  


వైద్యారోగ్య శాఖతో కీలకంగా..

ఇప్పటి వరకు ఏడు శాఖలకు పనిచేసిన అనుభవం కలిగిన హరీశ్‌రావు ఎనిమిదో శాఖగా వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను స్వీకరించారు. ఎలాంటి శాఖనైనా సమర్థవంతంగా నడిపిస్తారనే పేరున్న ఈ శాఖను కూడా గాడిలో పెడతారని నమ్మకం వ్యక్తమవుతున్నది. వైద్యారోగ్య శాఖపై ఆయనకు ఇదివరకే పట్టున్నది. సిద్దిపేటలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు, వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణం, వెల్‌నె్‌ససెంటర్‌, మెటర్నిటీ సెంటర్‌, ఎల్వీప్రసాద్‌ కంటి ఆస్పత్రి, ఆక్సిజన్‌ప్లాంట్ల ఏర్పాటు, ఉచిత డయాగ్నస్టిక్‌ సెంటర్‌, ఉచిత స్కానింగ్‌ సెంటర్ల ఏర్పాటుతో సిద్దిపేటను హెల్త్‌హబ్‌గా మార్చారు. కరోనా కష్టకాలంలో ఉమ్మడి జిల్లాలో మెరుగైన వేద్యం అందజేసేందుకు కృషిచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుపేదలకు ఉచిత వైద్యం అందించేందుకు కృషిచేశారు. సీఎంఆర్‌ఎఫ్‌ సహాయం అందేలా చూడటంలో మంత్రుల్లో హరీశ్‌దే మొదటిస్థానం. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ బాఽధ్యతలు అప్పగించడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు  జిల్లాలో వైద్య రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఆయన రాష్ట్రస్థాయిలోనూ విజయవంతంమవుతారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-10T05:16:13+05:30 IST