కొత్త ఏడాదిలో ఆరోగ్యమే మహాభాగ్యం
ABN , First Publish Date - 2022-01-01T03:53:57+05:30 IST
‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే సూక్తిని పాటిస్తేనే రాబోయే కరోనా మూడోదశ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇప్పటికే రెండేళ్లపాటు వైరస్‌తో సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఎవరికివారు అప్రమత్తంగా ఉంటూ.. స్వీయజాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యంతోపాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇదొక్కటే కరోనాను నియంత్రించే.. మన చేతుల్లో ఉన్న అసలైన ఆయుధమని అంటున్నారు. ఇప్పటికే ప్రాణ, ఆర్థిక నష్టాలను చవిచూడగా.. ఆ అనుభవాలతో వచ్చే ముప్పును అధిగమించాలని హెచ్చరిస్తున్నారు.

రెండేళ్లుగా కరోనాతో సహవాసం
మూడోవేవ్‌పై ముందస్తు హెచ్చరికలు
అప్రమత్తత, స్వీయజాగ్రత్తలే శరణ్యం
‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే సూక్తిని పాటిస్తేనే రాబోయే కరోనా మూడోదశ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇప్పటికే రెండేళ్లపాటు వైరస్‌తో సహవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేడు కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఎవరికివారు అప్రమత్తంగా ఉంటూ.. స్వీయజాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యంతోపాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇదొక్కటే కరోనాను నియంత్రించే.. మన చేతుల్లో ఉన్న అసలైన ఆయుధమని అంటున్నారు. ఇప్పటికే ప్రాణ, ఆర్థిక నష్టాలను చవిచూడగా.. ఆ అనుభవాలతో వచ్చే ముప్పును అధిగమించాలని హెచ్చరిస్తున్నారు.
-ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 31
కరోనా మొదటి దశలో ఉమ్మడి మెదక్ జిల్లా సేఫ్‌గా ఉంది. రాష్ట్రమంతటా వైరస్ విస్తరిస్తుంటే ఈ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం పెద్దగా లేదు. దీంతో కొంత నిర్లక్ష్యం ఏర్పడి ప్రజలు హెచ్చరికలను విస్మరించారు. నిబంధనలను పట్టించుకోలేదు. ఫలితంగా 2020 సెప్టెంబరు నెలలో సిద్దిపేట జిల్లా రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదయ్యే జిల్లాల్లో ఐదో స్థానానికి చేరింది. ఆ తర్వాత 2021లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. గడిచిన రెండేళ్లలో 50వేల కేసులు దాటి పోయాయి. దాదాపు 300పైగా ప్రజలు మృతిచెందారు. మాస్కులు ధరించకపోవడం, శానిటైజర్లను విస్మరించడం, భౌతికదూరమంటే పట్టింపు లేకపోవడమే ఇందుకు కారణాలు. జనసంచార ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఉండడంతో వైరస్ వేగంగా వ్యాప్తిచెందింది. ఎన్నికలు, సభలు, శుభకార్యాలు తదితర సందర్భాల్లోనూ ప్రజలు నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేశారు.
గండాన్ని గట్టెక్కాలంటే..
2022 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. 2020 సంవత్సరం మార్చి నెలలో, 2021 ఫిబ్రవరి నెలలోనే కరోనా వైరస్ ప్రభావం ముంచుకొచ్చింది. ఇప్పుడు ఒమైక్రాన్ రూపంలో మరో గండం పొంచి ఉంది. ఇప్పుడిప్పుడే కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖల నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఇప్పటికే ఎన్నో కుటుంబాలు కరోనా కారణంగా ఛిద్రమై రోడ్డున పడ్డాయి. పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబాల పరిస్థితిని చూసి కనువిప్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మాస్కులు ధరించి, శానిటైజేషన్ చేసుకుంటూ, భౌతికదూరం పాటిస్తూ, మన ఆరోగ్యంతోపాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడితేనే ఈ గండం నుంచి గట్టెక్కవచ్చు. కొత్త ఏడాది సందర్భంగా దురలవాట్లను దూరం చేసుకొని కరోనాను ఎదుర్కొనే రోగనిరోధకశక్తిని పెంచుకునే దిశగా ముందడుగు వేయాలి.
అందరి లైఫ్‌స్టైల్ మారాలి
- డాక్టర్ రజినీష్ వల్లకోటి, ఫిజీషియన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్దిపేట
కొవిడ్ మొదటి, రెండు దశల్లో సుమారుగా 600 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లకు వైద్యచికిత్స అందించిన అనుభవం ఉన్న డాక్టర్ రజినీష్ ’ఆంధ్రజ్యోతి’తో పలు విషయాలు పంచుకున్నారు.
-ప్రతీ ఒక్కరి లైఫ్‌స్టైల్ మారాలి.
-కరోనా ఉందనగానే చేతులు కడుక్కోవడం, మాస్కు పెట్టుకోవడం కాదు. ఎప్పటికీ ఈ రెండు పనులు చేస్తే ఎలాంటి రోగాలు మన దరిచేరవు.
-రెండు డోసుల వ్యాక్సిన్‌తోపాటు బూస్టర్ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి.
-ముఖ్యంగా చలికాలం ఏ ఇన్ఫెక్షన్ అయినా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుంది. అందుకే ఇదే సమయంలో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. కావున అనుమానం ఉన్న వెంటనే ఇతరులకు దూరంగా ఉంటూ చికిత్స పొందాలి.
-కరోనా మొదటి వేవ్‌లో తక్కువ మందికి వైరస్ సోకింది. రెండో దశలో వేగంగా విస్తరించడంతోపాటు డెత్‌రేట్ బాగా పెరిగింది. ప్రస్తుత ఒమైక్రాన్‌కు డెత్‌రేట్ ఇప్పుడు లేనప్పటికీ రాబోవు రోజుల్లో ఇది ఎలా పరిణమిస్తుందనేది వేచిచూడాలి. అందుకే ముందు జాగ్రత్తగా ఉండడం మేలు.
-జలుబు, దగ్గు రాగానే వెంటనే సొంత వైద్యం చేసుకోవడం చాలామంది చేస్తున్నారు. దీనివల్ల రెండేవేవ్‌లో కొందరికి ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
కరోనా ఏ రూపంలో వస్తుందో తెలియదు
-శ్వేత, సిద్దిపేట పోలీస్ కమిషనర్
కరోనా ముప్పు ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి, రెండు దశల్లో ప్రాణనష్టం సంభవించింది. చాలామంది ఆత్మీయులను, కుటుంబసభ్యులను కోల్పోయారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. వ్యాక్సిన్ వేసుకోవాలి. మన అజాగ్రత్తతో ప్రాణాలకే ముప్పు పొంచి ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతోపాటు సక్సెస్‌పై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా యువత, విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయొద్దు. చదువే మనల్ని నిలబెడుతుంది.. గెలిపిస్తుంది.