కేంద్రం రాబందు.. మేం రైతుబంధు

ABN , First Publish Date - 2021-11-10T05:17:15+05:30 IST

తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వ్యవసాయదారుల శ్రేయస్సే ధ్యేయంగా అనేక పథకాలు అమలుచేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈ నెల 12న నిర్వహించే రైతుమహాధర్నా, పార్టీ కమిటీల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

కేంద్రం రాబందు.. మేం రైతుబంధు

అన్నదాతల శ్రేయస్సే మా ప్రాధాన్యం

ఈ నెల 12న రైతు మహాధర్నా 

ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట అగ్రికల్చర్‌, నవంబరు 9 : తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, వ్యవసాయదారుల శ్రేయస్సే ధ్యేయంగా అనేక పథకాలు అమలుచేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈ నెల 12న నిర్వహించే రైతుమహాధర్నా, పార్టీ కమిటీల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధువుగా నిలిస్తే.. కేంద్ర ప్రభుత్వం రైతుల పాలిట రాబందులా తయారయ్యిందని ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన ధాన్యాన్ని  కొంటారా.. కొనరా? అని సీఎం కేసీఆర్‌ సూటిగా ప్రశ్నించినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి నిరసనగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు ఈ నెల 12న రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతుమహాధర్నా చేస్తామని వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గంలో నిర్వహించే ధర్నాకు పార్టీ శ్రేణులు, రైతుబంధు సభ్యులు, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయడం లేదనే విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు వివరించాలని సూచించారు.


రెండ్రోజుల్లో కమిటీలు పూర్తికావాలి

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తికావాలని మంత్రి హరీశ్‌రావు నాయకులను ఆదేశించారు. మండలాలవారీగా పరిస్థితిని పార్టీ పరిశీలకులు, మండల అధ్యక్షులు, ఎంపీపీ, జడ్పీటీసీలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 70 శాతం కమిటీల ఎన్నిక పూర్తయ్యిందని వారు మంత్రికి వివరించారు. రెండ్రోజుల్లో కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే త్వరలోనే మండలాలవారీగా కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకుని మండల అధ్యక్షులు, కార్యవర్గాన్ని ఎన్నుకుందామని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-10T05:17:15+05:30 IST