మల్లన్న ఆలయంలో వేలం పాటలకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-06-22T05:10:03+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో వేలంపాటల నిర్వహణకు ఆలయాధికారులు చర్యలు తీసుకున్నారు.

మల్లన్న ఆలయంలో వేలం పాటలకు గ్రీన్‌సిగ్నల్‌
కొమురవెల్లి మల్లన్న

జూలై 5న నిర్వహణకు అధికారుల చర్యలు

చేర్యాల, జూన్‌ 21 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో వేలంపాటల నిర్వహణకు ఆలయాధికారులు చర్యలు తీసుకున్నారు. జూలై 5న ఈ-టెండర్‌కమ్‌ బహిరంగ వేలం పాటలు జరిపేందుకు సోమవారం నోటిఫై విడుదల చేశారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మొక్కుబడులుగా అందించే తలనీలాలు సేకరణ, ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు అమ్మకం, భక్తులు సమర్పించిన కొబ్బరి ముక్కలు సేకరణ, వస్త్రములు, ఒడిబియ్యం పోగుచేసుకునుట, కోరమీసాల విక్రయం, సెల్‌ఫోన్‌ కౌంటర్‌, పాదరక్షలు భద్రపరచడం, ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయించడంతో పాటు టాయిలెట్‌ బ్లాకుల లీజు ఇతరత్రా అంశాల పట్ల ప్రతీయేటా డిసెంబరులో వేలంపాటలు నిర్వహిస్తుండటంతో ఆలయానికి ఆదాయం సమకూరుత్నుది. ఈ నేపథ్యంలో పలువురు గతేడాది డిసెంబరు వరకు టెండర్‌ దక్కించుకున్నా కరోనా లాక్‌డౌన్‌తో ఆలయాన్ని మూసివేయడంతో కార్యకలాపాలు సాగలేదు. కానీ సంబంధిత గడువు ముగియడంతో ఆలయాధికారులు ఈయేడాది జనవరిలో టెండర్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడంతో వేలంపాటదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనా కారణంగా తాము నష్టపోయామని, ఈయేడాది జాతరకు తమకే అవకాశం కల్పించాలని వేడుకోవడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. గత ఏప్రిల్‌లో ఆర్థిక సంవత్సరం ముగియగా, స్టే సమయం కూడా ముగియడంతో ఆలయాధికారులు వేలంపాటల నిర్వహణకు తిరిగి చర్యలు తీసుకున్నా.. కరోనా సెకండ్‌వేవ్‌ అడ్డంకిగా నిలవడంతో ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం రెండురోజుల క్రితం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఆలయాధికారులు జూలై 10 నుంచి ఏడాదికాలం పాటు టెండర్‌ హక్కులు కల్పించేందుకు 5న ఆలయంలో వేలంపాటల నిర్వహణకు నిర్ణయించి నోటీసు బోర్డుపై ప్రదర్శన చేశారు. టెండర్‌దారులు ఈనెల 23 నుంచి జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ఈవో బాలాజీశర్మ తెలిపారు. 

Updated Date - 2021-06-22T05:10:03+05:30 IST