మెతుకు సీమలో గోదావరి పరవళ్లు
ABN , First Publish Date - 2021-04-12T05:51:36+05:30 IST
గోదావరి జలాలు మెదక్ జిల్లాకు చేరుకున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి విడుదల చేసిన నీళ్లు హల్దీవాగులో పరవళ్లుతొక్కుతున్నాయి. తూప్రాన్ మండలం యావాపూర్ శివారులోని మోతెరాళ్ల వద్ద హల్దీపై జిల్లాలో నిర్మించిన మొట్టమొదటి చెక్‌డ్యాం ఆ
హల్దీవాగులో ప్రవహిస్తున్న కొండపోచమ్మ సాగర్ నీళ్లు
యావాపూర్ వద్ద మెదక్ జిల్లాలో ప్రవేశం
చెక్‌డ్యాంలు నింపుతూ ముందుకు
తూప్రాన్/తూప్రాన్‌రూరల్, ఏప్రిల్ 11: గోదావరి జలాలు మెదక్ జిల్లాకు చేరుకున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి విడుదల చేసిన నీళ్లు హల్దీవాగులో పరవళ్లుతొక్కుతున్నాయి. తూప్రాన్ మండలం యావాపూర్ శివారులోని మోతెరాళ్ల వద్ద హల్దీపై జిల్లాలో నిర్మించిన మొట్టమొదటి చెక్‌డ్యాం ఆదివారం ఉదయం పొంగిపొర్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 6న కొండపోచమ్మ సాగర్ ప్రధాన కాలువ నుంచి గోదావరి జలాలను సంగారెడ్డి కాలువకు వదిలిన విషయం తెలిసిందే. ఆ నీళ్లు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్‌పేటలోని ఖాన్ చెరువు నుంచి శనివారం హల్దీవాగులోకి చేరుకున్నాయి. నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం మీదుగా ఆదివారం మెదక్ జిల్లా పరిధిలోకి హల్దీ ప్రవాహం చేరుకున్నది. యావాపూర్ చెక్‌డ్యాం నిండిన అనంతరం మధ్యాహ్నం తూప్రాన్ చెక్‌డ్యాంకు చేరుకున్నాయి. కిష్టాపూర్ చెక్‌డ్యాం నుంచి ఎత్తిపోతల ద్వారా తూప్రాన్ పెద్ద చెరువును నింపనున్నారు. సోమవారం నాటికి కొప్పులపల్లి శివారులోని హల్దీడ్యాంలోకి నీళ్లు చేరనున్నాయి.
రైతుల హర్షాతిరేకాలు
చరిత్రలోనే ఎన్నడూ లేనట్టు మండే ఎండల్లో హల్దీవాగు పరవళ్లు తొక్కడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యాంల వద్దకు చేరుకుని గంగమ్మకు పూజలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సుభా్‌షరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతా్‌పరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి సోమవారం ఉదయం యావాపూర్ శివారులోని మోతెరాళ్ల చెక్‌డ్యాం వద్దకు రైతలు, గ్రామస్థులతో కలిసి ర్యాలీగా చేరుకున్నారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంకల్పించిన భగీరథ ప్రయత్నం సఫలీకృతమైందని పేర్కొన్నారు. మండుటెండల్లో వాగులు పొంగిపొర్లడం చారిత్రాత్మక ఘట్టమని కొనియాడారు. ఎండిపోతున్న వరిపంటలకు గోదావరి జలాలను విడుదలచేసి కేసీఆర్ రైతులను ఆదుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తామన్న సీఎం హామీ నెరవేర్చుతున్నారని వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ హరిత రాష్ట్రంగా అవతరించడం ఖాయమని స్పష్టం చేశారు. తూప్రాన్ ఎంపీపీ స్వప్న వెంకటేశ్‌యాదవ్, గడ స్ఫెషలాఫీసర్ ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, యావాపూర్ సర్పంచి నర్సింహారెడ్డి, ఉప సర్పంచి లక్ష్మి, ఎంపీటీసీ సంతో్‌్‌షరెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్, ప్యాక్స్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాగునీళ్లు.. కన్నీళ్లు నిండిన మా పసుపులేరు : ప్రజా గాయకుడు గద్దర్
తూప్రాన్, ఏప్రిల్ 11: ‘పసుపేరుకు వందనం.. గంగమ్మను తెచ్చిన ప్రభుత్వానికి వందనం.. తాగునీళ్లు, కన్నీళ్లు రెండూ నిండిన మా పసుపేరు’ అని ప్రజాగాయకుడు గద్దర్ పేర్కొన్నారు. తన సొంత గ్రామమైన తూప్రాన్ హల్దీవాగులో గోదావరి జలాలు ప్రవహిస్తున్న సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడారు. ‘మై విలెజ్ ఆఫ్టర్ 60 ఇయర్స్’ పుస్తకం రాయడానికి తాను తూప్రాన్‌కు వచ్చినపుడు ఓ తల్లి తనను ‘ఏ ఊరి కథ రాస్తవు.. వాగు నీళ్లు ఏట్ల పోతున్నయి.. చెరువు నింపే ఇగరం చేయు జర..’ అని అడిగిందని చెప్పారు. ఆ తల్లి సూచించినట్లు ప్రయత్నం చేసి ఎత్తిపోతలను తీసుకువచ్చానన్నారు. ఎంపీ, మాజీ మంత్రి సునీతారెడ్డి, హరీశ్‌రావు సహకరించారన్నారు. గోదావరి జలాలలతో చెక్‌డ్యాంలు నిండడంతో తూప్రాన్‌లో చెరువులను నింపుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించానని.. ప్రస్తుతం కాళేశ్వరం నీటి తరలింపును స్వాగతిస్తున్నట్టు గద్దర్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణం కోసం చేసిన త్యాగాలను వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే హల్దీవాగును సందర్శించి గంగమ్మకు దండం పెడతానని పేర్కొన్నారు.