భూరికార్డులు పక్కాగా ఉండాలి
ABN , First Publish Date - 2021-02-06T05:37:32+05:30 IST
సిద్దిపేటసిటీ, ఫిబ్రవరి 5: సిద్దిపేట జిల్లాలో భూముల రికార్డులను పక్కా గా అప్‌డేట్ చేయాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశంలో కలెక్టర్ వెంకట్రామారెడ్డి
సిద్దిపేటసిటీ, ఫిబ్రవరి 5: సిద్దిపేట జిల్లాలో భూముల రికార్డులను పక్కా గా అప్‌డేట్ చేయాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ విభాగాలు ప్రజాప్రయోజనార్థం చేసిన భూసేకరణ, ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాల జాబితాను సిద్ధం చేసేందుకు సంబంధిత ప్రభుత్వశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో భూసేకరణ చేసిన వివరాలను ఇరిగేషన్‌శాఖ అధికారుల సమన్వయంతో రెవెన్యూశాఖ అప్‌డేట్ చేయాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేద్దామని ఆయన కోరారు. పకడ్బందీగా రికార్డులను పొందుపర్చేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు. రికార్డుల్లో ఎన్యుమరేష్ అయ్యిందో లేదో చూడాలని, ఇరిగేషన్ అధికార యంత్రాంగం, సిబ్బంది రెవెన్యూశాఖకు సహకరించాలని కోరారు. జిల్లాలోని 376 రెవెన్యూ గ్రామాల్లోని భూముల రికార్డులు ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉండాలన్నారు. ప్రతీ రెవెన్యూ గ్రామంలో ఆ గ్రామ సర్వే నంబర్ల వారీగా వివరాలను సేకరించి ఎప్పటికప్పడు నమోదు చేయాలని తహసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. పలుచోట్ల భూసేకరణ చేసిన భూ రికార్డులు సక్రమంగా ఉండడం లేదని, సర్వే నంబర్‌కు సంబంధించి, అలాగే ప్రోఫార్మా 1,2,3 ప్రకారం కాపీలను జత చేయాలని అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజూ 7 సర్వే నంబర్లు, రోజుకు 4 రెవెన్యూ గ్రామాలు భూసేకరణ వివరాలు నమోదు చేపట్టాలని, రానున్న కాలంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని తహశీల్దార్లకు సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవోలు అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ వేణుగోపాల్, ఈఈ రవీందర్‌రెడ్డి, అన్నీ మండలాలకు చెందిన తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
మెడికల్ కళాశాల పరిశీలన
సిద్దిపేట ఎన్సాన్‌పల్లి శివారులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణ, మల్టీపర్పస్ హైస్కూల్ ఆవరణ, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో అనంతరెడ్డి, అర్బన్ తహసీల్దార్ విజయ్, సర్వేయర్ రామ్‌భద్ర, సిబ్బంది ఉన్నారు.