‘గౌరవెల్లి’ సొరంగం పనులు పూర్తి

ABN , First Publish Date - 2022-01-01T03:56:54+05:30 IST

గౌరవెల్లి రిజర్వాయర్‌కు గుండెకాయ అయిన సొరంగం(టన్నెల్‌) పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా రెండు చోట్ల కట్ట పనులతో పాటు పరిహార సమస్య కొలిక్కివస్తే కుడి ఎడమ కాల్వ ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, కోహెడ, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండలాల్లోని 1.06 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.

‘గౌరవెల్లి’ సొరంగం పనులు పూర్తి
నిర్మాణం పూర్తయిన సర్జ్‌పూల్‌, పనులు పూర్తయిన పంపుహౌజ్‌

పంపులు, మోటార్ల బిగింపు

ఈ నెలలో డ్రైరన్‌కు ఏర్పాట్లు


హుస్నాబాద్‌, డిసెంబరు 31 :  గౌరవెల్లి రిజర్వాయర్‌కు గుండెకాయ అయిన సొరంగం(టన్నెల్‌) పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంకా రెండు చోట్ల కట్ట పనులతో పాటు పరిహార సమస్య కొలిక్కివస్తే కుడి ఎడమ కాల్వ ద్వారా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, కోహెడ, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండలాల్లోని 1.06 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. రూ.583 కోట్లతో 8.23 టీఎంసీల సామర్థ్యంతో అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీటిని తీసుకవచ్చే సొరంగం పనులు దాదాపు పుష్కర కాలం తరువాత పూర్తయ్యాయి. దీంతో ఈ నెలలో డ్రై రన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2007 సంవత్సరంలో రిజర్వాయర్‌కు శంకుస్థాపన జరుగగా 2010లో సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. రీ డిజైన్‌లో భాగంగా 1.4 టీఎంసీలు ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా తోటపల్లి చెరువు నుంచి జలాలను తీసుకవచ్చే సొరంగ పనుల్లో కొన్నింటిని మార్పు చేశారు. మొదటి డిజైన్‌ ప్రకారం రూ.409 కోట్లతో పనులు చేశారు. రీ డిజైన్‌ వల్ల అదనంగా మరో రూ.380కోట్లు వెచ్చించాల్సి వచ్చింది.

12 కిలోమీటర్ల సొరంగం

గౌరవెల్లి రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోసే టన్నెల్‌ పనులతో పాటు పంపులు, మోటార్ల బిగింపు పూర్తి కావడంతో ఈ నెలలో డ్రై రన్‌ నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సొరంగం పనులు 2010 సంవత్సరంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. రీ డిజైన్‌తో దీని సామర్థ్యాన్ని కూడ పెంచారు. మిడ్‌మానేరు ద్వారా బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్‌లైన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి సొరంగం ద్వారా నీటిని తీసుకవస్తారు.  తోటపల్లి ఆన్‌లైన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో రేగొండ వద్ద గౌరవెల్లి రిజర్వాయర్‌ ఉంటుంది. వీటి మధ్య 16 కిలోమీటర్లు ఉండగా  4 కిలోమీటర్ల ఓపెన్‌ కాలువ, 12 కిలోమీటర్ల సొరంగం ఉంటుంది. కోహెడ మండలం తీగలకుంటపల్లి వద్ద సొరంగం మొదలై హుస్నాబాద్‌ మండలం రేగొండ శివారు వరకు ఉంటుంది. మొదట భూమికి 25 మీటర్ల లోతులో సొరంగం పనులు జరగుగా చివర్లో భూమికి 107 మీటర్ల లోతులో ఈ పనులు చేశారు. 5.6 మీటర్ల టన్నెల్‌ షిప్‌తో 32 క్యూబిక్‌తో నీటిని తీసుకెళ్లే విధంగా సొరంగం నిర్మించారు. 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల లోతుతో సర్జ్‌పూల్‌(నీళ్ల సంపు),  61 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు, 130 మీటర్ల లోతుతో పంపుహౌజ్‌ను నిర్మాణం చేశారు. 120 రోజులు నిరంతరం ఒక్కొక్కటి 2వేల క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లను చైనా నుంచి తీసుకొచ్చి బిగించారు.  కాగా రిజర్వాయర్‌ నుంచి ఇతర గ్రామాలకు వెళుతున్న రెండు రోడ్ల వద్ద గండ్లను పూడ్చాల్సి ఉండగా ప్రస్తుతం ఆ పనులు చేస్తుండటంతో నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. ఈ పనులు పూర్తయితేనే మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది.

తొలుత 1.4 టీఎంసీల నీటిని నింపే అవకాశం

నిర్వాసితుల సమస్యలు పరిష్కారమై రెండు రోడ్ల వద్ద గండ్లను పూడ్చే పనులు పూర్తయినా గౌరవెల్లి రిజర్వాయర్‌ సామర్థ్యం 8.23 టీఎంసీలైనప్పటికీ 1.4 టీఎంసీల వరకే నీటిని నింపనున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ అనుమతులు లేకుండా రిజర్వాయర్‌ ఎత్తు పెంచారని నిర్వాసితులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. వారు కూడా ఈ రిజర్వాయర్‌ను పరిశీలించి అనుమతులు లేకుండా రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచారని, ఇందుకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. దీని దృష్ట్యా మొదట 1.4 టీఎంసీల వరకే నీటిని నింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-01T03:56:54+05:30 IST