‘గౌరవెల్లి’ నిర్వాసితుల అరిగోస

ABN , First Publish Date - 2021-12-31T05:03:09+05:30 IST

గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు ప్రాజెక్ట్‌ కట్ట వద్ద చేపట్టిన దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకున్నది. రిజర్వాయర్‌ నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తిచేసి నీటిని నింపేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నది. పనులు తుదిదశకు చేరుకున్నా పరిహారం అందకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన నెలకొన్నది. న్యాయమైన పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు పూర్తిచేయాలని వారం క్రితం పనులను అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు లాఠీలు ఝలిపించడంతో ఆగ్రహంతో దీక్షలకు పూనుకున్నారు.

‘గౌరవెల్లి’ నిర్వాసితుల అరిగోస
గౌరవెల్లి ప్రాజెక్ట్‌ వద్ద నిర్వాసితుల దీక్షా శిబిరం

పరిహారంలో తేడాలు

అర్హులకూ అందని ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ

యువతకు దక్కని పరిహారం

పనులను అడ్డుకున్న నిర్వాసితులు

లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

ప్రభుత్వ తీరుకు నిరసనగా నిర్వాసితుల నిరసన దీక్ష

రాత్రింబవళ్లు ప్రాజెక్టు కట్టపైనే..

బాధితులకు ప్రతిపక్ష నేతల సంఘీభావం 


అక్కన్నపేట, డిసెంబరు 30: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు ప్రాజెక్ట్‌ కట్ట వద్ద చేపట్టిన దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకున్నది. రిజర్వాయర్‌ నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తిచేసి నీటిని నింపేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నది. పనులు తుదిదశకు చేరుకున్నా పరిహారం అందకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన నెలకొన్నది. న్యాయమైన పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు పూర్తిచేయాలని వారం క్రితం పనులను అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు లాఠీలు ఝలిపించడంతో ఆగ్రహంతో దీక్షలకు పూనుకున్నారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉద్యమిస్తామనే పట్టుదలతో చలిని సైతం లెక్కచేయకుండా రాత్రింబవళ్లు దీక్షా శిబిరంలోనే ఉంటున్నారు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల పరిధి గుడాటిపల్లి పంచాయతీ పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ నియోజకవర్గానికి నీరందించడానికి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 2007లో 1.4 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్ట్‌ పనులను ప్రారంభించారు. ఇందుకోసం గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని తెనుగుపల్లి సోమాజీతండా, సేవ్యానాయక్‌తండా, జాలువాయితండా, చింతల్‌తండా, తిరుమల్‌తండా, మద్దెలపల్లి, దుబ్బతండా, కొత్తపల్లి, బొంద్యానాయక్‌తండాల పరిధిలో 1,800 ఎకరాల భూమిని సేకరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం 2015లో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 8.25 టీఎంసీలకు పెంచుతూ రీడిజైన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అదనంగా 2,070 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ఎకరాకు రూ. 6.95 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 3,870 ఎకరాలు అవసరం కాగా ఇప్పటి వరకు 3,598 ఎకరాల భూసేకరణ పూర్తయింది. రిజర్వాయర్‌కు సంబంధించి పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులను నెలరోజుల్లో పూర్తిచేసి నీటిని నింపేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు జరిపిస్తున్నది.


పరిహారంలో అసమానతలు

2007–08 అంచనాల ప్రకారం సేకరించిన 1,800 ఎకరాలకు ఎకరానికి రూ. 2.10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణం కోసం అదనంగా చెల్లించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతీ కుటుంబానికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద అదనంగా రూ. 8 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. 2015 అంచనాల ప్రకారం సేకరించడానికి నోటీసులు ఇచ్చిన భూమిలో 272 ఎకరాలకు యజమానులైన 71 మంది రైతులు ప్రభుత్వం ఇస్తున్న (ఎకరాకు రూ. 6.95 లక్షల చొప్పున) పరిహారం న్యాయ సమ్మతంగా లేదని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం వీరికి రూ. 15 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. దీంతో కోర్టును ఆశ్రయించినవారిలో 160 ఎకరాలకు సంబంధించిన రైతులు సర్కారు ఇస్తున్న పరిహారం తీసుకుని భూములను అప్పగించారు. ఇంకా 112 ఎకరాలకు సంబంధించిన నిర్వాసితులు పరిహారం డబ్బులు తీసుకునేది లేదని తేల్చిచెప్పి కోర్టులో పోరాడుతున్నారు. 


ఆర్‌అండ్‌ఆర్‌ జాబితాలో గందరగోళం

గౌరవెల్లి ప్రాజెక్టు మొదట రూపొందించిన (1.4 టీఎంసీల సామర్థ్యంతో) అంచనాల ప్రకారం నిర్వాసితులవుతున్న 927 మంది బాధితులకు రూ. 8 లక్షల చొప్పున ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అందజేశారు. ఈ జాబితాలో 110 మంది పేర్లు రాలేదు. దీంతో వారంతా తమ పేర్లను జాబితాలో చేర్చాలని అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తీరుగుతున్నారు. వడ్డీతో కలిపి రూ.10 లక్షలు చెల్లించాలని వారు కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పి అధికారులు చేతులు దులపుకున్నారు. అలాగే, తాజా అంచనాల ప్రకారం 2015 జనవరి 1 నుంచి 2021 అక్టోబరు 15 వరకు 18 ఏళ్లు నిండిన వయోజనులు 338 మంది ఉన్నట్టు గుర్తించిన అధికారులు వారికి ఉపాధి కోసం రూ. 6 లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రతిపాదనలు రూపిందించారు. కానీ ఇప్పటి వరకు పరిహారం మంజూరు కాలేదు. 


నిర్వాసితులపై విరిగిన లాఠీ

భూనిర్వాసితులకు అందజేస్తున్న పరిహారంలో పలుమార్లు మార్పులు జరగడంతో గందరగోళం నెలకొన్నది. మొదటి దఫాలో చెల్లించిన పరిహారం చాలా తక్కువగా ఉండటంతో తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మొదటి దఫాలో గుర్తించిన నిర్వాసితుల్లో 110 కుటుంబాల పేర్లు ఆర్‌అండ్‌ఆర్‌ లీస్టులో అసలే రాలేదు. అలాగే, గుర్తించిన 338 మంది వయోజనులు ప్రభుత్వం చెల్లిస్తామంటున్న రూ. 6 లక్షలు సరిపోదని.. తమకు కూడా రూ. 8 లక్షల చొప్పున ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరందరితో పాటు కోర్టు ఆశ్రయించి ఇప్పటికీ భూమి అప్పగించని 112 ఎకరాలకు సంబంధించిన నిర్వాసితులు పరిహారం సంగతి తేలకుండానే ప్రాజెక్టు పనులు కొనసాగించడంతో పనులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిర్వాసితులపై లాఠీలు ఝలిపించారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా లాఠీలతో చితకబాదడంతో నిర్వాసితుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వ తీరకు నిరసనగా బాధితులు ప్రాజెక్టు కట్టపైనే దీక్షలు చేపట్టారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రాత్రింబవళ్లు దీక్షా శిబిరంలోనే ఉంటున్నారు. 


పెరుగుతున్న మద్దతు 

నిర్వాసితుల దీక్షలకు ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. బీజేపీ నేత ఈటల రాజేందర్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ నేత బొమ్మ శ్రీరాంచక్రవర్తి దీక్షలకు మద్దతు పలికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ దీక్షా శిబిరానికి వెళ్లగా నిర్వాసితులు అడ్డుకున్నారు. సమస్యలను పరిష్కరించకుండా పనులెలా కొనసాగిస్తారని నిలదీశారు. 

Updated Date - 2021-12-31T05:03:09+05:30 IST