గౌరవెల్లిపై గరంగరం

ABN , First Publish Date - 2021-03-24T05:45:06+05:30 IST

మెట్ట ప్రాంత వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ వరద కాలువ గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్‌ పనులు పుష్కరం దాటినా పూర్తికాకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

గౌరవెల్లిపై గరంగరం
గౌరవెల్లి రిజర్వాయర్‌

పుష్కరం దాటినా పూర్తికాని రిజర్వాయర్లు

కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామన్న కేసీఆర్‌ మాటలేమయ్యాయి?

హుస్నాబాద్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఖరిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు 

నేడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ

ఆందోళనకు సిద్ధమవుతున్న మిగతా పార్టీలు

హుస్నాబాద్‌, మార్చి 23 : మెట్ట ప్రాంత వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ వరద కాలువ గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్‌ పనులు పుష్కరం దాటినా పూర్తికాకపోవడంపై ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో వీటి తర్వాత చేపట్టిన అనంతసాగర్‌, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ వంటి ప్రాజెక్టులు పూర్తిచేస్తారు.. కానీ వీటిని మాత్రం పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. హుస్నాబాద్‌ ప్రాంత రిజర్వాయర్లపై ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే కుర్చీ వేసుకుని గౌరవెల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేయిస్తానని కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఏడేళ్లయినా అమలు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్‌తో బుధవారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ చేపట్టనున్నారు. ఇదే కాకుండా ఈ రిజర్వాయర్‌ పనులు పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇటీవల సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. మిగతా పార్టీలు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఈ రిజర్వాయర్లు పూర్తయితే హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని హుస్నాబాద్‌, కోహెడ, చిగురుమామిడి, భీమదేవరపల్లి మండలాల్లోని 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. ముఖ్యంగా గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లు చైనా నుంచి రావాల్సి ఉన్నదని, అదేవిధంగా కొంతమంది భూ నిర్వాసితులు న్యాయమైన పరిహారం కోసం కోర్టును ఆశ్రయించడంతో పనుల్లో జాప్యం జరుగుతున్నదని అధికారులు పేర్కొంటున్నారు.

2007లో పనులకు శంకుస్థాపన

వర్షాధారంపై అధారపడి వ్యవసాయం సాగించే మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాలతో పాటు వరంగల్‌ జిల్లాలోని పలు గ్రామాలకు సాగు నీరందించాలని శ్రీరాంసాగర్‌ ఇందిరమ్మ వరద కాలువ నిర్మాణానికి 2007లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హుస్నాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ఒప్పందం ప్రకారం ఈ రిజర్వాయర్లను ఐదేళ్లలో పూర్తి చేయాలని ఉన్నది. 2014 రాష్ట్ర ఆవిర్భావ, అనంతరం టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, అప్పటి భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ ప్రాజెక్టులను సందర్శించారు. అప్పుడు చేసిన డిజైన్‌తో ఏం మాత్రం ప్రయోజనం లేదని రీ డిజైన్‌ చేశారు. ఇందులో భాగంగానే తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేశారు. 1.4 టీఎంసీలు ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు, 0.1584 టీఎంసీలున్న గండిపల్లి రిజర్వాయర్‌ను 1.4 టీఎంసీకి పెంచారు. వీటి సామర్థ్యం పెంచడంతో అదనంగా భూ సేకరణ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ పనులు ఆగుతూ.. సాగుతూనే ఉన్నాయి. 

చైనా నుంచి రావాల్సిన మోటార్లు

మిడ్‌మానేరు ద్వారా బెజ్జంకి మండలం తోటపల్లి ఆన్‌లైన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి గౌరవెల్లి రిజర్వాయర్‌లోకి సొరంగం ద్వారా నీటిని తీసుకెళ్లే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 120 రోజులు నిరంతరం ఒక్కొక్కటి 2 వేల క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే 32 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లు, పంపులు బిగించాల్సి ఉండగా... ఇవి చైనా నుంచి రావాల్సి ఉన్నది. సర్జ్‌పూల్‌, పంపుహౌజ్‌, డెలివరీ సిస్టం నిర్మాణ పనులు మొత్తం పూర్తయ్యాయి. రిజర్వాయర్‌ నుంచి గ్రామాలకు వెళ్తున్న రెండు రోడ్లను పూడ్చాల్సి ఉన్నది. అయితే గతేడాదిగా ఆ పనులు నిలిచిపోయాయి. ఇదేకాకుండా కొంతమంది భూ నిర్వాసితులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ సమస్య కూడా పరిష్కారం కావాల్సి ఉన్నది. 

యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే చలో అసెంబ్లీ

- బొమ్మ శ్రీరాం చక్రవర్తి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి 

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్‌తో బుధవారం చలో అసెంబ్లీ చేపట్టాం. ఈ రిజర్వాయర్ల కంటే తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 14 ఏళ్ల కిందట చేపట్టిన దీన్ని మాత్రం పెండింగ్‌లో పెడుతున్నారు. ఇది రాజకీయ కుట్రలో భాగమేనని మేం భావిస్తున్నాం. మిగిలిన 10 శాతం పనులు జరుగకుండా చేస్తున్నారంటే ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌కు పేరు రాకుండా భవిష్యత్‌లో ఆయనను నష్టపెట్టాలని చూస్తుండొచ్చు. ఇదేకాకుండాఅన్నింట్లో హుస్నాబాద్‌ ప్రాంతంపై పక్షపాతం చూపుతున్నారు. ఇప్పటికే రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ రిజర్వాయర్లను త్వరగా పూర్తిచేయకపోతే ప్రత్యక్ష ఉద్యమాలకు దిగుతాం. ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతాం.

Updated Date - 2021-03-24T05:45:06+05:30 IST