మహిళా ప్రాంగణ భవనానికి నిధులు మంజూరు
ABN , First Publish Date - 2021-03-25T05:27:45+05:30 IST
మహిళలకు స్వయం ఉపాధి, శిక్షణ ఇచ్చేందుకు సిద్దిపేటలో మహిళా ప్రాంగణం భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

సిద్దిపేట సిటీ, మార్చి 24 : మహిళలకు స్వయం ఉపాధి, శిక్షణ ఇచ్చేందుకు సిద్దిపేటలో మహిళా ప్రాంగణం భవన నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. రిసోర్స్ సెంటర్లను తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్నదని, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో మహిళా ప్రాంగణ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కేంద్రాలను దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాలు (మహిళా శిక్షణా కేంద్రాలు)గా ఆమెలో ఉన్న గొప్పతనం, ధైర్యాన్ని మహిళలకు అందించేందుకు ఉపయోగపడతాయన్నారు. ఇందులో శిక్షణతో పాటు, ఉపాధిమార్గాలు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో గ్రామీణ పట్టణ, నిరాశ్రయులైన, వితంతువు, కౌమారదశలో ఉన్న విద్యావంతులైన నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇస్తున్నది. తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ ద్వారా ఐసీడీఎస్ కార్యకర్తలు, కౌమార దశలో ఉన్న బాలికలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, సహాయకులకు కూడా శిక్షణ ఇస్తుందన్నారు. ఈ ప్రాంగణంలో ఎగ్జిబిషన్లు, వాణిజ్య ఉత్సవాలు, కొనుగోలుదారు, అమ్మకదారుల సమావేశాలు, డిజైన్, ప్రదర్శన కేంద్రాలు మొదలైన మార్కెటింగ్ అవకాశాలను సులభతరం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
నిధుల మంజూరుపై హర్షం
సిద్దిపేట అగ్రికల్చర్, మార్చి 24 : జిల్లా మహిళా ప్రాంగణం భవనానికి మంత్రి హరీశ్‌రావు నిధులు మంజూరుచేయడంపై జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ భవన నిర్మాణంతో మహిళలకు ఉపాధి శిక్షణ అవకాశాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు.