పనిచేయని శీతల శవపేటికలు
ABN , First Publish Date - 2021-10-30T04:42:03+05:30 IST
అంతిమ సంస్కారాలకు అవరోధం ఏర్పడకూడదనే ఉద్దేశంతో కొనుగోలు చే సిన శవపేటికలు నిరుపయోగంగా మారాయి. 32 వార్డులు 70 వేల జనాభా కలిగిన మెదక్ మున్సిపాలిటీకి ఎమ్మెల్యే పద్మాదే వేందర్‌రెడ్డి తన నిధులతో ఒక ఫ్రీజర్‌ను అందజేశారు.

మెదక్ మున్సిపాలిటీలో మూలకు చేరిన ఫ్రీజర్లు
మెదక్ మున్సిపాలిటీ, అక్టోబరు 29: అంతిమ సంస్కారాలకు అవరోధం ఏర్పడకూడదనే ఉద్దేశంతో కొనుగోలు చే సిన శవపేటికలు నిరుపయోగంగా మారాయి. 32 వార్డులు 70 వేల జనాభా కలిగిన మెదక్ మున్సిపాలిటీకి ఎమ్మెల్యే పద్మాదే వేందర్‌రెడ్డి తన నిధులతో ఒక ఫ్రీజర్‌ను అందజేశారు. మున్సిపల్ నిధులతో మరో రెండు ఫ్రీజర్లను రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. కానీ తరచూ మరమ్మతులకు గురవుతున్న ఫ్రీజర్లు ప్రజలకు ఉపయోగపడటం లేదు. మరమ్మతుల కోసం వేలాది రూపాయలు వృథా అవుతున్నాయి. వాటి నిర్వహణపై అధికారుల అజమాయిషీ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో తరచూ చెడిపోతున్నాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. డిపాజిట్ ఏమీ తీసుకోకుండా ఉచితంగా అందజేయడంతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఫ్రీజర్లు తరచుగా పాడవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నగదు డిపాజిట్ తీసుకుంటే వాటి వినియోగంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకునే అవకాశముందంటున్నారు.
నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు : శ్రీహరి, మెదక్ మున్సిపల్ కమిషనర్
అంతిమ సంస్కారాల కోసం ఫ్రీజర్‌ను ఉచితంగా అందజేస్తున్నాం దీంతో ప్రజలు దాని వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తీసుకెళ్లే సమయంలో పరిశీలించి ఇస్తున్నా.. తిరిగి వచ్చే సమయానికి చెడిపోయి వస్తున్నాయి. తిరిగి ఇచ్చే సమయంలో సిబ్బందికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పంప్‌హౌస్ వద్ద పడేసి పోతున్నారు. దీంతో అవి తరచుగా పాడవుతున్నాయి. ఎంతోకొంత డిపాజిట్ తీసుకుంటే వినియోగించేవారు జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తాం.