ఉప్పొంగిన వరద

ABN , First Publish Date - 2021-07-24T05:32:55+05:30 IST

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పొలాల్లోకి నీరు చేరింది. వర్షాలు ఇలానే కొనసాగితే పత్తి, కంది, మొక్కజొన్న పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో 140 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. చెరువులు, చెక్‌డ్యాములు, కుంటలు జలకళను సంతరించుకోగా మత్స్యకారులు, స్థానికులు అక్కడ చేపల వేటకు పోటీపడుతున్నారు.

ఉప్పొంగిన వరద
మద్దూరు మండలం లద్నూరులోని ఎల్లమ్మ చెరువులో చేపలు పడుతూ సందడి చేస్తున్న గ్రామస్థులు

ఎడతెరిపిలేని వర్షాలకు పొలాల్లో చేరిన నీరు

మరో రెండు రోజులు కొనసాగితే పంటలకు నష్టమే

పొంగిపొర్లుతున్న చెక్‌డ్యాములు, వాగులు

నిండుకుండలా చెరువులు, కుంటలు

ఉత్సాహంగా చేపల వేట


వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో పొలాల్లోకి నీరు చేరింది. వర్షాలు ఇలానే కొనసాగితే పత్తి, కంది, మొక్కజొన్న పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లాలో 140 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. చెరువులు, చెక్‌డ్యాములు, కుంటలు జలకళను సంతరించుకోగా మత్స్యకారులు, స్థానికులు అక్కడ చేపల వేటకు పోటీపడుతున్నారు.


సిద్దిపేట సిటీ, జూలై 23 : సిద్దిపేట జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి అన్ని మండలాల్లోని చెరువులు, చెక్‌డ్యామలు, వాగులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండ ఉండేందుకు అధికార యంత్రాంగ కలెక్టరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసింది. జిల్లాలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కురిసిన వర్షపాతం నమూనాల ప్రకారం జిల్లాలో సగటున 5 సెంటీమీటర్ల వాన పడింది. కొమురవెల్లి, కొండపాక మండలాల్లో అధికంగా 7 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. దుబ్బాక, చిన్నకోడూర్‌, మిరుదొడ్డి, చేర్యాల, మద్దూరు, దూళ్మిట్ట, హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లో 6 సెంటీమీటర్లు, కోహెడ, బెజ్జంకి, సిద్దిపేట అర్బన్‌, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోల్‌, వర్గల్‌, జగదేవ్‌పూర్‌, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్‌ మండలాల్లో 4 సెంటీమీటర్లకుపైగా వర్షం పడింది. 

140 ఎకరాల్లో పంట నష్టం

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు నిండి మత్తళ్లు ప్రవహించడంతో పొలాల్లోకి వరద నీరు చెరుతుంది. జిల్లాలో ఇప్పటికే 140 ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 112 ఎకరాల్లో వరి, 28 ఎకరాల్లో పత్తి నీటిపాలయ్యాయి. వర్షం జోరు తగ్గకపోవడంతో చెరువు పక్కల పొలాలున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.


వరద నీటిలో చేపల వేట

చేర్యాల/చిన్నకోడూరు/మిరుదొడ్డి/మద్దూరు/కోహెడ : సిద్దిపేటలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండి దిగువకు నీరు ప్రవహిస్తుండటంతో ఆ వరద నీటిలో వెళ్తున్న చేపలను పట్టడానికి స్థానికులు పోటీపడుతున్నారు.చిక్కిన చేపల్లో కొన్ని సుమారు పదికిలోల బరువు ఉన్నాయి. చిన్నకోడూరు మండలంలో చెరువులు, కుంటలు నిండి మత్తడి పోస్తుండడంతో చేపలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. మత్స్యకారులు మత్తళ్ల వద్ద  చేపలు పడుతున్నారు. మద్దూరు మండలం లద్నూరులోని ఎల్లమ్మ చెరువులో చేపలు ఎదురెక్కాయి. గ్రామస్థులు చేపలు పడుతూ సందడి చేశారు. చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో గురువారం ఉదయం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జోరు వాన కురిసింది. ఆయా గ్రామాల్లోని కుంటలు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. చేర్యాల మండలం తాడూరు వాగు రెండోరోజూ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేచరేణి వాగులో చెక్‌డ్యాం నిండి పొంగిపొర్లుతుండడంతో చేపలు పట్టారు. చిట్యాల చెరువు నిండి మత్తడి దూకింది. అలాగే కొమురవెల్లి మండలకేంద్రంలోని మల్లన్న చెరువు మత్తడి పోస్తుంది. మిరుదొడ్డిలోని మోడల్‌స్కూల్‌లో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తున్నది. స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విద్యుత్తు ట్రాన్స్‌పార్మర్‌ చుట్టూ నీరు నిలవడంతో ఉపాధ్యాయులు జంకుతున్నారు. మండలం పరిధిలోని కూడవెళ్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాగువద్దకు వెళ్లకుండా మిరుదొడ్డి, భూంపల్లి పోలీసులు చర్యలు తీసుకున్నారు. మిరుదొడ్డి మండలం అల్వాల్‌ గ్రామం నుంచి సిద్దిపేటకు వెళ్లే మార్గంలోని వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తుండడంతో సర్పంచ్‌ ఎనగంటి కిష్టయ్య, పోలీసులతో కలిసి రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలను, స్టాప్‌బోర్టును ఏర్పాటు చేశారు.  అక్బర్‌పేటలో సర్పంచ్‌ స్వరూపబుచ్చయ్య ఆధ్వర్యంలో కూడవెళ్లివాగు సమీపంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోహెడ మండలంలోని బస్వాపూర్‌ బ్రిడ్జి వద్ద మోయతుమ్మెద వాగు, పోరెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద తంగళ్లపల్లి పిల్లి వాగు ప్రవాహన్ని అడిషనల్‌ ఎస్పీ సందెపోగు మహేందర్‌ పరిశీలించారు. ఆయన వెంట సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐ రాజాకుమార్‌ ఉన్నారు.


సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి/మెదక్‌, జూలై 23 : రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలతో సంగారెడ్డి, నారాయణఖేడ్‌, కోహీర్‌, తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న, సోయా, పత్తి పంట పోలాల్లోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. మరో రెండు మూడు రోజులు ఇలాగే వర్షం కొనసాగితే పత్తి, కంది, మొక్కజొన్న, సోయా పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా పత్తి పంటకు నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. ఏకధాటి వర్షాలతో మెదక్‌ జిల్లాలో 300 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చిన్నశంకరంపేట, మెదక్‌, హవేళీఘన్‌పూర్‌, టేక్మాల్‌ మండలాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా. శుక్రవారం ఉదయం నుంచి గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పర్యటించి పంట నష్టంపై ఆరా తీశారు. వర్షాలధాటికి చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజాంపేట మండలం కాసీంపూర్‌ తండా పులి చెరువుకుంట కట్టతెగి పోయింది. దీంతో పొలాలు నీటితో నిండిపోయాయి. రామాయాంపేట మండలం ఝాన్సిలింగాపూర్‌లో రోడ్డు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్‌ - కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో పోచారం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. కొల్చారం మండలంలోని మహబూబ్‌నహర్‌ కాలువ దిగువన భారీగా వరద నీరు వచ్చింది. దీంతో రాంపూర్‌, కిష్టాపూర్‌లో పంటలన్నీ నీట మునిగాయి. నర్సాపూర్‌ మండలంలో కురిసిన వర్షాలకు పొలాల్లోకి వరద నీరు చేరింది. మెదక్‌ జిల్లాలో వందకుపైగా ఇళ్లు నేలకూలినట్లు అధికారులు చెబుతున్నారు. కౌడిపల్లిలో జడ్పీటీసీ కవిత ఇళ్లు కూలింది. మెదక్‌ నీటిపారుదల సర్కిల్‌ పరిధిలో 163 చెరువులు నిండుకుండలా మారాయి. శుక్రవారం మెదక్‌ జిల్లాలో నార్సింగి మండలంలో అధికంగా 7.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజాంపేట మండలంలో 7 సెంటీమీటర్లు పడింది. సంగారెడ్డి జిల్లాలో సగటున 1.22 సెంటీమీటర్ల వర్షం రాగా అత్యధికంగా గుమ్మడిదల మండలంలో 2.7 సెంటీమీటర్లు కురిసింది. సింగూరు ప్రాజెక్టులోకి శుక్రవారం ప్రాజెక్టులోకి 4,394 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులోకి 19.864 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి.


Updated Date - 2021-07-24T05:32:55+05:30 IST