జోరుగా ఏరువాక

ABN , First Publish Date - 2021-06-23T04:50:32+05:30 IST

వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు కురియడంతో రైతులు పొలంపనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి వానాకాలం సీజన్‌ ప్రారంభమై 22 రోజులు పూర్తవగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 11 రోజులు వర్షం కురిసింది.

జోరుగా ఏరువాక

వానాకాలం పంటల సాగులో రైతన్న బిజీ

సంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే రెట్టింపు వర్షపాతం

7,40,845 ఎకరాల్లో పంటలు సాగుచేస్తారని అంచనా

అత్యధికంగా 4.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూన్‌ 22: వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే వర్షాలు కురియడంతో రైతులు పొలంపనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి వానాకాలం సీజన్‌ ప్రారంభమై 22 రోజులు పూర్తవగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 11 రోజులు వర్షం కురిసింది. సాధారణంగా 82.6 మిల్లీమీటర్ల వర్షం కురియాల్సి ఉండగా ఇందుకు రెట్టింపుస్థాయిలో 162.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. కంగ్టి, సిర్గాపూర్‌, కల్హేర్‌, నారాయణఖేడ్‌, నాగిలిగిద్ద, మనూర్‌, రాయికోడ్‌, న్యాల్‌కల్‌ తదితర 18 మడలాల్లో 59 శాతం అధికంగా వర్షం కురిసింది. జహీరాబాద్‌, ఝరాసంగం, వట్‌పల్లి, కొండాపూర్‌ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. హత్నూర, గుమ్మడిదల, జిన్నారం, కంది, సదాశివపేట మండలాల్లో 20 నుంచి 59 శాతంలోపు అధిక వర్షపాతం నమోదైంది. వర్షాలు పుష్కలంగా కురియడంతో రైతులు జోరుగా పంటలు వేసుకుంటున్నారు. పత్తి, పునాస పంటల విత్తనాలు వేయడం పలు ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయ్యింది. ఈ వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 7,40,845 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు పండించనున్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. అత్యధికంగా పత్తి 4,20,000 ఎకరాల్లో వేయనున్నారు. వరి 75వేల ఎకరాలు, కందులు 38,500 ఎకరాలు, మొక్కజొన్న 1,850 ఎకరాలు, జొన్న 5,200 ఎకరాలు, సోయా 15 వేల ఎకరాలు, చెరుకు 20,500 ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో పెసర, మినుము, శనగ, వేరుశనగ తదితర పంటలను సాగుచేయనున్నారు.

Updated Date - 2021-06-23T04:50:32+05:30 IST