సాగు నీటి కోసం రైతుల వాగ్వాదం

ABN , First Publish Date - 2021-03-22T05:29:24+05:30 IST

రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా సాగునీటిని అందించే క్రమంలో పలు గ్రామాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది.

సాగు నీటి కోసం రైతుల వాగ్వాదం
రైతులతో మాట్లాడుతున్న పోలీసులు, అధికారులు

కోదండరావుపల్లి వద్ద ఘటన

అధికారుల సమన్వయంతో పరిష్కారం

నారాయణరావుపేట, మార్చి 21 : రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా సాగునీటిని అందించే క్రమంలో పలు గ్రామాల రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఆదివారం నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి శివారు వద్ద గల ఆర్‌-9 కాలువ నుంచి నీటిని తరలించేందుకు ఇబ్రహీంపూర్‌, కోదండరావుపల్లి, బంజేరుపల్లి గ్రామ రైతులు కాలువలో అడ్డుకట్ట వేశారు. విషయాన్ని తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లి, బందనకల్‌ గ్రామాల రైతులు అడ్డుకట్టను తొలగించాలని కోరుతూ ఇబ్రహీంపూర్‌, బంజేరుపల్లి, కోదండరావుపల్లి రైతులను కోరారు. దీంతో వారు ససేమిరా అనడంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న సిద్దిపేట ఇరిగేషన్‌ ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి, ముస్తాబాద్‌ ఎస్‌ఐ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అధికారుల, పోలీసుల సమక్షంలో ఇరుగ్రామాల రైతుల మధ్య సయోధ్య కుదిర్చారు. రెండురోజుల పాటు కాలువ నీటిని బందనకల్‌, వెంకట్రావుపల్లి  గ్రామాలకు తరలిస్తూ, నాలుగు రోజుల పాటు ఇబ్రహీంపూర్‌, కోదండరావుపల్లి, బంజేరుపల్లి గ్రామాలకు తరలించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఆయా గ్రామాల సర్పంచులు శంకర్‌, దేవయ్య, నగేష్‌ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T05:29:24+05:30 IST