ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-05-19T05:25:56+05:30 IST

ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత, ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలులో జాప్యంపై రైతుల ఆందోళన
వెల్దుర్తిలో ధాన్యం తరలింపులో జాప్యంపై తహసీల్దార్‌ను నిలదీస్తున్న రైతులు

లారీలు రావడం లేదని తహసీల్దార్‌  కార్యాలయం ఎదుట ధర్నా

వెల్దుర్తి, మే 18 : ధాన్యాన్ని తరలించేందుకు లారీల కొరత, ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన వెల్దుర్తి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి వారం రోజులైనా కొనుగోలు చేయకపోవడం, కొనుగోలు చేస్తున్న ధాన్యం బస్తాలు లారీల కొరతతో రవాణా కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పట్టించుకున్న వారే కరువయ్యారని మండిపడ్డారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తమ కష్టాలను పట్టించుకోకపోతే ధాన్యాన్ని తగుల బెడుతామని, లేకుంటే హల్దీ వాగులో పారబోస్తామని హెచ్చరించారు. కాగా తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌ను తమ సమస్యలు మీకుపట్టవా అంటూ నిలదీశారు. లారీల కొరత ఉండడం వల్ల జాప్యం జరుగుతుందని తహసీల్దార్‌ రైతులను సముదాయించారు. కొనుగోలు విషయం చైర్మన్‌తో మాట్లాడానని తహసీల్దార్‌ అనడంతో ఆగ్రహించిన రైతులు చైర్మన్‌ దళారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వ్యాపారుల ద్వారా దళారులు తెచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడూ కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. తమ సమస్యలను చైర్మన్‌కు చెప్పిన పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆందోళనలో రైతులు కృష్ణ, యాదగిరి, శివశంకర్‌ గౌడ్‌, రాజు గౌడ్‌, లక్ష్మయ్య, మల్లేశ్‌ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించాలి

మెదక్‌ అర్బన్‌, మే 18: ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించాలని మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్‌ అధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నర్సాపూర్‌ నియోజకవర్గంలో లారీల కొరతతో సొసైటీ, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిలిచిపోయిందన్నారు. వర్షం పడే సూచనలుండడంతో ధాన్యాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నదన్నారు. టార్పాలిన్లు అందుబాటులో లేక రైతులు అద్దెకు తీసుకోవాల్సిన దుస్ధితి ఏర్పడిందని పేర్కొన్నారు. టెండర్‌దారుడు లారీలను సమకూర్చకపోవడంతో  రైతులే సొంతంగా రవాణా చార్జీలు చెల్లించుకుని రైస్‌మిల్లుకు తీసుకెళ్తే అక్కడ రెండు రోజుల పాటు ఎదురుచూడాల్సి వస్తోందని వాపోయారు. ఽధాన్యాన్ని విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రైతుల ఖాతాలో నగదు జమ కాలేదన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. 

ధాన్యం తూకంలో అవకతవకలను అరికట్టాలి

చిన్నశంకరంపేట, మే 18 : ధాన్యం తూకంలో అవకతవకలను అరికట్టాలని మండలానికి చెందిన రైతులు డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని సురారం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో తూకంలో అవకతవకలను రైతులు అడ్డుకున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా స్ధానిక తహసీల్దార్‌ స్పందించి ప్రాథమిక విచారణ చేపట్టాలని వీఆర్వోను అదేశించారు. విచారణలో అవకతవకలు వాస్తవమేనని వీఆర్వో నిర్ధారించినట్లు రైతులు తెలిపారు. అవకతవకలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన డీఆర్డీవో

పుల్‌కల్‌, మే 18 : మండలంలోని ఇసోజిపేట, లక్ష్మీసాగర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు అధికారి సూర్యారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వడ్ల తూకాల్లో మోసం జరుతుతుందంటూ ఆయా గ్రామాల రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆయన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు తీసుకొచ్చిన వడ్లల్లో తేమ శాతం, తూకాన్ని పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి, వడ్ల మ్యాచర్‌ను పరిశీలించి గన్నీ సంచులు, టోకెన్లను అందజేయాలని సూచించారు. ఆయన వెంట డీపీఎం శ్రీనివాస్‌, మండల ఐకేపీ ఏపీఎం శివలక్ష్మి ఉన్నారు. 

కల్హేర్‌ : ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిర్గాపూర్‌ మండలంలోని కడ్పల్‌, ఖాజాపూర్‌, గోసాయిపల్లి, సిర్గాపూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ కొమురయ్య మంగళవారం సందర్శించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం సమత ఉన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి 

నారాయణఖేడ్‌, మే 18 : ఖేడ్‌ మండలం హన్మంత్‌రావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ఏర్పాటు చేయాలని గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల రైతులు కోరుతున్నారు. గ్రామంలో  కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించినా ఏర్పాటు చేయలేదని తెలిపారు. మాధ్వార్‌, లింగాపూర్‌ కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్తే కరోనా కారణంగా ఆయా గ్రామ రైతులతో పాటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదన్నారు. 

సమస్యలను పరిష్కరించాలి 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డివిజన్‌ కన్వీనర్‌ చిరంజీవి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

కౌడిపల్లి, మే 18: ‘20 రోజులైనా రైతుల ఖాతాలో జమ కాని డబ్బు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై మంగళవారం జేసీ రవీందర్‌తో కలిసి మండలంలోని మహ్మద్‌నగర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ధాన్యం తూకం వేయకపోవడంతో 25 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నామని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఽధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసేలా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన వెంటనే వీలైనంత త్వరగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీల కొరత ఉండడంతో వాటిని నిలువ ఉంచేందుకు ఓ ఫంక్షన్‌హాల్‌ను ఏర్పాటు చేసినట్లు రైతులకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్‌ రాణాప్రతాప్‌ సింగ్‌, సర్పంచ్‌ దివ్యమహిపాల్‌రెడ్డి, నాయకులు శివాంజనేయులు, రైతులు ఉన్నారు.

Updated Date - 2021-05-19T05:25:56+05:30 IST