మగ్దుంపూర్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2021-11-26T05:47:18+05:30 IST
మండలంలోని మగ్దుంపూర్‌లో బోరు మోటారు వద్ద ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు.

అక్క వల్లే రైతుబీమా రావడంలేదనే కోపంతో గూడురులో మృతదేహంతో ధర్నా
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన ఉద్రిక్తత
శివ్వంపేట, నవంబరు 25: మండలంలోని మగ్దుంపూర్‌లో బోరు మోటారు వద్ద ఓ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. కాగా మృతుడికి చెందిన భూమిని అతడి అక్క ఎవరికీ తెలియకుండా పట్టా చేయించుకోవడంతో తమకు రైతుబీమా రాకుండాపోయిందనే ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు గూడురులో ఆమె ఇంటి ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. దీంతో గూడురులో గురువారం ఉద్రిక్తత నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. మగ్దుంపూర్‌కు చెందిన సోము నర్సింహులు(38) తన పొలంలో తుకం నారు పోసేందుకు గురువారం ఉదయం వెళ్లి బోరు ఆన్‌చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ రవికాంత్‌రావు వివరించారు. మృతుడికి భార్య లావణ్య, కొడుకు, కూతురు ఉన్నారు.
మృతుడి అక్క ఇంటి వద్ద ధర్నా
కాగా నర్సింహులు మృతదేహాన్ని గూడురు గ్రామానికి తీసుకువచ్చి మృతుడి అక్క ఇంటి ఎదుట ధర్నాకు పూనుకున్నారు. విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన నర్సింహులుతో సహా నల్గురు అన్నదమ్ములకు సంబంధించిన ఆరు ఎకరాల భూమి ఉన్నది. సదరు భూమిని గూడురులో నివాసముండే వారి అక్క లక్ష్మీనర్సమ్మ సోదరులకు తెలియకుండా తన పేరిట భూమి పట్టా చేయించుకున్నది. ఈ విషయమై సోదరులతో ఆమెకు గత కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొన్నది. నర్సింహులు విద్యుదాఘాతంతో మృతి చెందగా, అతడి పేరిట గుంట భూమి కూడా పట్టా లేకపోవడంతో రైతుబీమా రాకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, గ్రామస్థులు మృతదేహంతో సహా గూడురు గ్రామంలో ఉంటున్న అక్క ఇంటికి చేరుకుని వారి ఇంటి ముందు గురువారం ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే గూడురులో మృతుడి అక్క లక్ష్మీనర్సమ్మ పరిస్థితి ముందే గమనించి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. కాగా అంతకు ముందే సోదరుడు చనిపోయిన విషయం తెలుసుకున్న లక్ష్మీనర్సమ్మ మగ్దుంపూర్‌కు రాగా ఆమెను చితకబాదడంతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి విరమింపజేసేందుకు యత్నించారు.