కు.ని.కి పాట్లు

ABN , First Publish Date - 2021-02-09T05:08:11+05:30 IST

జిల్లాలో కటుంబ నియంత్రణ(కు.ని.) ఆపరేషన్లు నిలిచిపోయాయి. గతేడాది కరోనా లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు శిబిరాలు ఏర్పాటు చేయలేదు. పలువురు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తోంది. పేదలకు ఇది ఆర్థికంగా భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరిగి శిబిరాలను నిర్వహించాలని కోరుతున్నా ఇంకా ఉన్నతాధికారుల నుంచి కార్యాచరణ కరువైంది. అయితే జిల్లా వైద్యాధికారులు మాత్రం త్వరలోనే వాటిని తిరిగి ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇస్తున్నారు.

కు.ని.కి పాట్లు

లాక్‌డౌన్‌ నుంచి జిల్లాలో నిలిచిన ఆపరేషన్లు

ఏడాది కాలంగా శిబిరాల నిర్వహణ బంద్‌

విధిలేక ప్రైవేట్‌ వైపు పలువురి మొగ్గు

పేదలపై తప్పని ఆర్థిక భారం.. ప్రోత్సాహానికి దూరం

త్వరలో ఏర్పాటు చేస్తామంటున్న వైద్యాధికారులు



ఆంధ్రజ్యోతి, ప్రతినిధి, మెదక్‌, ఫిబ్రవరి 8  : జిల్లాలో కటుంబ నియంత్రణ(కు.ని.) ఆపరేషన్లు నిలిచిపోయాయి. గతేడాది కరోనా లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు శిబిరాలు ఏర్పాటు చేయలేదు. పలువురు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తోంది. పేదలకు ఇది ఆర్థికంగా భారంగా మారుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిరిగి శిబిరాలను నిర్వహించాలని కోరుతున్నా ఇంకా ఉన్నతాధికారుల నుంచి కార్యాచరణ కరువైంది. అయితే జిల్లా వైద్యాధికారులు మాత్రం త్వరలోనే వాటిని తిరిగి ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇస్తున్నారు.

   జనాభా నియంత్రణకు దంపతులకు ఇద్దరు పిల్లలు లేక ఒక్కరు చాలు అనే నినాదాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా చాలా మంది ఆ నియంత్రణ పాటించకుండా ముగ్గురు నుంచి నలుగురు పిల్లల సంతానం కలిగి ఉంటున్నారు. ఆ రకంగా జనాభా పెరుగుదల కొనసాగుతుండగా నియంత్రణ లేకుండా పోతోంది. ఈ క్రమంలో జనాభాను అదుపు చేసేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. గ్రామ స్థాయిలో ఇద్దరు పిల్లలు కలిగిన దంపతులను గుర్తించడం, కు.ని. ఆపరేషన్‌ చేసేందుకు ఒప్పించడం ఇందుకోసం నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు. సర్కారు దవాఖానాల్లో కు.ని. ఆపరేషన్‌ చేయించుకున్న మహిళలకు, పురుషులకు నగదు ప్రొత్సాహాకాన్ని అందజేస్తుంటారు. గతేడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా పీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల స్థాయిలో శిబిరాల నిర్వహణ ఉండేది. గత మార్చి నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరగడం లేదు. ఏటా సాధారణంగా నాలుగు వేలకు పైగా ట్యూబెక్టమీ(మహిళలు), వేసెక్టమీ(పురుషులు) ఆపరేషన్లు జరుగుతుంటాయి. 2019-20 4,200 కు.ని. ఆపరేషన్లు లక్ష్యంగా సర్కారు నిర్ణయించగా... 4,584 ఆపరేషన్లు పూర్తిచేశారు. కు.ని. శిబిరాలు లేకపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నవారు, ఒక్కరే చాలని అనుకుని ఆపరేషన్లు చేయించుకునేందుకు ఆసక్తి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో శిబిరాల నిర్వహణ లేకపోవడం ఇందుకు కారణం. క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేసి పరిస్థితులు కుదుట పడినప్పటికీ ఆపరేషన్లకు సంబంధించి వైద్యశాఖ నుంచి ఎలాంటి కార్యాచరణ వెలువడడం లేదు.


ప్రైవేట్‌కు వెళ్తే భారమే

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కు.ని. ఆపరేషన్లు జరగకపోవడంతో పలువురు ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తున్నారు. అయితే ఇది వారికి ఆర్థికంగా భారం పడుతోంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మహిళలకు ట్యూబెక్టమి, పురుషులకు వేసెక్టమి ఆపరేషన్‌ చేయడం, మందులు, ఇతరత్రా ఫీజుల కోసం సుమారుగా రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. అదే సర్కారు దవాఖానాల్లో చేస్తే ఉచితంగా ఆపరేషన్‌ చేయించుకోవడంతో పాటు వారికి వచ్చే నగదు ప్రోత్సాహకాన్ని కోల్పోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


వచ్చేవారం నుంచి ఏర్పాటు చేస్తాం 

కరోనా నేపథ్యంలో కుటుంబ నియంత్రణ క్యాంపులు ప్రభుత్వం నిలిపివేసిన మాట వాస్తవం. అయితే ప్రస్తుతం మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టినందున క్యాంపులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. వచ్చేవారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.

- డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, జిల్లా వైద్యాధికారి, మెదక్‌

Updated Date - 2021-02-09T05:08:11+05:30 IST