సోషల్‌ మీడియాలో నకిలీ బాబా కలకలం

ABN , First Publish Date - 2021-01-23T06:04:14+05:30 IST

పట్టణంలో బాబా వేషధారణలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా తీరుగుతున్నదన్న వందంతులు సోషల్‌ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

సోషల్‌ మీడియాలో నకిలీ బాబా కలకలం

సంగారెడ్డి క్రైం, జనవరి 22: పట్టణంలో బాబా వేషధారణలో పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా తీరుగుతున్నదన్న వందంతులు సోషల్‌ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి బాబా వేషంలో పట్టణంలోని రాజంపేటకు కారులో రావడం, ఓ ఇంటి ముందు కారును ఆపి కిందకు దిగడం, అక్కడున్న వారిని ఏదో అడిగి వెంటనే కారులో వెళ్లిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. వచ్చిన వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సభ్యుడేమోనని అనుమానించిన స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ డి.వెంకటేష్‌ తమ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి దర్యాప్తు చేయించిన అనంతరం మాట్లాడారు. పట్టణంలో ఎలాంటి ముఠా తిరగడం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని సీఐ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రచారం అబద్ధమని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. అయితే పట్టణంలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే  100కు లేదా పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. 


Updated Date - 2021-01-23T06:04:14+05:30 IST