మల్లన్న ఆలయ పాలకమండలి నియామకంపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-05-03T05:09:44+05:30 IST

ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి నియామకంపై ఉత్కంఠ నెలకొన్నది.

మల్లన్న ఆలయ పాలకమండలి నియామకంపై ఉత్కంఠ
మల్లన్న ఆలయం

టీఆర్‌ఎస్‌ నాయకుల్లో ఆశలు

అధినేతల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు


చేర్యాల, మే 2 : ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి నియామకంపై ఉత్కంఠ నెలకొన్నది. పునరుద్ధరణ కమిటీ గడువు కొద్దిరోజుల క్రితం ముగియడంతో కొత్త కమిటీపై ఆసక్తి నెలకొన్నది. ఏడేళ్లుగా ఖాళీగాఉన్న చేర్యాల వ్యవసాయమార్కెట్‌ కమిటీని ఇటీవలే నియమించడంతో.. మల్లన్న ఆలయ కమిటీ నియామకమే తరువాయి అని అంచనాలు వేస్తున్నారు. గ త బ్రహ్మోత్సవాలకు ముందు కేవలం నలుగురితో ఆలయ పునరుద్ధరణ కమిటీని నియమించారు. వారికి ఎలాంటి అధికారాలు, ఆలయ నిర్వహణపై అవగాహన లేకపోవడంతో మూడునెలలు నామమాత్రంగా కొనసాగారు. 

నూతన పాలకమండలి నియామకంపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో పదవి ఆశిస్తున్నవారు గాడ్‌ఫాదర్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మద్దూరు మండలానికి చెందిన మేక సంతోశ్‌కు చైర్మన్‌గా అవకాశం కల్పించగా ఆలయ నిర్వహణతో పాటు ఆదాయం పెంపునకు కృషిచేశారు. రెగ్యులర్‌ కమిటీలో ఆయనకే అకాశం దక్కుతుందని భావించినప్పటికీ  సీఎం కేసీఆర్‌ సన్నిహితుడు దువ్వల మల్లయ్యకు కమిటీలో చోటుకల్పించారు. ఆయన కేవలం మూడు నెలలపాటే కొనసాగడంతో తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు కొమురవెల్లికి చెందిన గీస భిక్షపతి, పడిగన్నగారి మల్లేశం, ఆలయ మాజీ చైర్మన్లు ముస్త్యాల కిష్టయ్య, ఆడెపు చంద్రయ్య, మేక సంతోశ్‌ మరసారి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌ కమిటీలో అవకాశం దక్కని నాయకులు కూడా ఆలయ కమిటీలో పదవులు ఆశిస్తున్నారు.

 టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్థానికుడైన ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన గీస భిక్షపతివైను మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం సాగుతున్నది. మల్లన్న ఆలయ కమిటీ త్వరలోనే నియమిస్తారనే అంచనాలున్నా ఇటీవల ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి అనిశ్చితి నెలకొన్నది.

Updated Date - 2021-05-03T05:09:44+05:30 IST