ఈద్ ముబారక్
ABN , First Publish Date - 2021-05-14T05:23:04+05:30 IST
రంజాన్ వేడుకలకు మసీదులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు అనుమతి లేనందున మసీదుల్లో విడతల వారీగా చేయనున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి, లాక్‌డౌన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ రంజాన్ వేడుకలను నిర్వహించుకోవాలని మతపెద్దలు ముస్లింలందరికీ సూచించారు.

కనిపించిన నెలవంక
కరోనా నిబంధనల మేరకు పండుగ నిర్వహించుకోవాలి
సూచించిన మతగురువులు
ఇళ్లలోనే వేడుకలకు ప్రాధాన్యం
మెదక్ కల్చరల్, మే 13 : రంజాన్ వేడుకలకు మసీదులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలకు అనుమతి లేనందున మసీదుల్లో విడతల వారీగా చేయనున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి, లాక్‌డౌన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ రంజాన్ వేడుకలను నిర్వహించుకోవాలని మతపెద్దలు ముస్లింలందరికీ సూచించారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
త్యాగాలకు, పవిత్రతకు, భక్తికి, సేవాభావానికి, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు రంజాన్ మాసంలో భాగం. ప్రతీ ముస్లిం తమ జీవిత సార్థకత కోసం రంజాన్ మాసాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తారు. ఏ నెలవంక అయితే చూసి పవిత్ర ఉపవాసాలు ప్రారంభిస్తారో అదే నెలవంకను నెల రోజుల తర్వాత చూసి ఈద్ ఉల్ ఫితర్(పండుగ)ను నిర్వహించుకుంటారు. నెలంతా అనుగ్రహాలు కురిపించినందుకు కృతజ్ఞతగా ప్రవక్త ప్రవచనాలను తలచుకుంటూ భక్తిశ్రద్ధలతో పండుగను చేసుకుంటారు.
ఈద్ నమాజ్ ఇలా...
వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. వారి ఎదురుగా ఇమామ్ నిలబడి ఆరు లేక పన్నెండు అదనపు తఖ్బీర్లతో రెండు రకాత్‌ల నమాజ్‌ను చేయిస్తారు. ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తర్వాత అల్లాహు అక్బర్ అని రెండు చేతులు పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తర్వాత సన సురా పఠించి, మళ్లీ అల్లాహు అక్బర్ అని పలికి చేతులు పైకెత్తి కిందకు వదిలేయాలి. ఇలా రెండు సార్లు చేసి మూడోసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సురె ఫాతిహా తర్వాత మరొక సురానో లేక కొన్ని వాక్యాల్లో పఠించి రుకు, సజ్దాలు చేస్తారు. తర్వాత రెండో రకాత్ కోసం నిలబడి మల్లి సురె ఫాతిహా, మరికొన్ని వ్యాక్యాలను పఠించి మూడుసార్లు అల్లాహు అక్బర్ అంటూ మూడుసార్లు చేతులు పైకెత్తి కిందకు వదిలేస్తారు. నాల్గో సారి అల్లాహుఅక్బర్ అంటూ రుకు చేస్తారు. తర్వాత సజ్దాలు చేసి, అత్తహియాతు, దురుద్ పఠించి ముందు కుడివైపునకు తర్వాత ఎడమ వైపునకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్‌బీర్‌లతో రెండు రకాత్‌ల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. తర్వాత ఇమామ్ ఖురాన్, హదీసులలోని విషయాలు తెలుపుతారు. ప్రస్తుత పరిస్థితులు అన్వయిస్తూ సందేశాన్ని ఇస్తారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకునే వారు. ఇప్పటి పరిస్థితులకనుగుణంగా దూరం నుంచే శుభాకాంక్షలు చెపుతూ సలాం చేస్తూ పండుగ నిర్వహించుకోనున్నారు.
నిబంధనలు పాటిస్తూ పండుగ చేసుకోవాలి
- అల్ హజ్ మౌలానా జావిద్ హుస్సామి, మెదక్ ముస్లిం వెల్ఫేర్ ప్రెసిడెంట్
కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ప్రభుత్వ విధించిన లాక్‌డౌన్ నిబంధనల మేరకు పండుగను నిర్వహించుకోవాలి. ఒక మసీదులో నలుగురు కంటే ఎక్కువగా నమాజ్ చేయకండి. ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లోనే పండుగను సంతోషంగా చేసుకోవాలి. ఈద్గాలకి ఎవ్వరూ వెళ్లొద్దు. కరోనా నుంచి విముక్తి కోసం ఆ దేవుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థించండి.
అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థించండి
మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట సిటీ, మే 13 : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పండుగను సామూహికంగా జరుపులేకపోతున్నామని, ఎవరి ఇంట్లో వారే నిర్వహించుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. ప్రభుత్వం రంజాన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. అందరూ బాగుండాలని కరోనా మహమ్మారి నుంచి బయట పడాలని అల్లాని ప్రార్థించాలని కోరారు. సిద్దిపేటలో పేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించామని, మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మెదక్ కలెక్టర్ శుభాకాంక్షలు
మెదక్ రూరల్, మే 13 : ముస్లింలకు మెదక్ కలెక్టర్ హరీశ్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలను ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లాక్‌డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పండుగను కుటుంబసభ్యులతో ఇళ్లలోనే నిర్వహించుకోవాలని సూచించారు. అన్ని మతపరమైన ప్రార్థనా స్థలాలు మూసివేయాలని, మతపరమైన సమావేశాలు, సమ్మేళనాలు అనుమతించబడవని లాక్‌డౌన్ నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్నదని తెలిపారు. ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
సంగారెడ్డి కలెక్టర్ శుభాకాంక్షలు
సంగారెడ్డి అర్బన్, మే 13 : రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలందరికీ సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు పండుగ శుభాకాంక్షలను ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల వద్దనే ప్రార్థనలను చేసుకోని కుటంబసభ్యులతో సంతోషంగా నిర్వహించుకోవాలని కోరారు. అల్లా కృపతో కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభించాలని ఆయన ఆకాంక్షించారు.