కేసీఆర్ వరాలతోనే దుబ్బాక అభివృద్ధి
ABN , First Publish Date - 2021-12-26T05:52:04+05:30 IST
దుబ్బాకలో కేసీఆర్ పర్యటించిన సందర్భంగా ప్రకటించిన వరాలే నేడు అభివృద్ధి ఫలాలుగా అందుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అందులో ఒకటే ఈ వందపడకల ఆసుపత్రి అని చెప్పారు.

దుబ్బాక అంటే ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ
రక్తనిధి, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తాం
ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
దుబ్బాక, డిసెంబరు 25 : దుబ్బాకలో కేసీఆర్ పర్యటించిన సందర్భంగా ప్రకటించిన వరాలే నేడు అభివృద్ధి ఫలాలుగా అందుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అందులో ఒకటే ఈ వందపడకల ఆసుపత్రి అని చెప్పారు. దుబ్బాకలో రూ.20 కోట్లతో నిర్మించిన వందపడకల ఆసుపత్రిని శనివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ చదువుకున్న బడిని రూ.10 కోట్లతో నిర్మించడమే దుబ్బాక పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న అమితమైన ప్రేమకు నిదర్శనమన్నారు. 2015లో సీఎం కేసీఆర్ దుబ్బాక పర్యటనలో ఇచ్చిన హామీలో భాగంగా వందపడకల ఆసుపత్రిని నిర్మించి ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి ఫలితంగానే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసుకుందన్నారు. ఆయన కన్న కలలను నెరవేర్చుకుంటున్నామన్నారు. ఎక్కడా లేనివిధంగా దుబ్బాకకు వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేశారని తెలియజేశారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి హయాంలోనూ జరగని అభివృద్ధి పనులు నేడు దుబ్బాకలో చేసుకున్నామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరిక మేరకు దుబ్బాక బస్టాండ్‌కు రూ.5 కోట్లను మంజూరయ్యాయని గుర్తుచేశారు. బస్టాండ్‌ను అధునాతన హంగులతో నిర్మించుకుంటున్నామన్నారు. అలాగే ఎంపీ కోరిక మేరకు వంద పడకల ఆసుపత్రికి మరో రూ.కోటీ 16 లక్షలను మంజూరు చేయించామన్నారు. ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ముస్తాబాద్ సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని, రెండు వార్డులను విడిగా కేటాయిస్తామని తెలిపారు. పిల్లల డాక్టర్‌తోపాటు ఇద్దరు సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు. దుబ్బాకలో బస్తీ దవాఖాన, పెద్దచీకోడులో పల్లె దవాఖానను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రక్తనిధి కేంద్రంను కూడా ఏర్పాటు చేస్తున్నామని, పది పడకల ఐసీయూలను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధునాతన మార్చురీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. రెండు ప్రీజర్‌లను ఇవ్వనున్నట్టు తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కోరిక మేరకు మరో వైకుంఠ రథం కూడా అందించనున్నామన్నారు. దుబ్బాక ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడితోపాటు దంత వైద్యులను కూడా మంజూరు చేస్తామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక పర్యటన ఖరారు చేసిన రోజు ఎలాంటి హామీలు అడగబోనని మాట తీసుకుని, ఇప్పుడు తన ఎదుట కోరికల చిట్టా పెట్టారన్నారు. వాటిని కాదనకపోవడానికి కారణం ఇక్కడి ప్రాంతం మీద సీఎం కేసీఆర్‌కు ఉన్న గౌరవమేనన్నారు. దుబ్బాకలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని నిర్మించాలని ఎంపీ ప్రతిపాదన తీసుకొచ్చారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానన్నారు. సమావేశంలో ఎర్రోల్ల శ్రీనివాస్, వంటేరు ప్రతా్‌పరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ వనితారెడ్డి, ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, నాయకులు ఆర్.రాజమౌళి, మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి పాల్గొన్నారు.