ఎవరైతే మాకేంటి..!

ABN , First Publish Date - 2021-11-06T05:01:09+05:30 IST

సీఎం సొంత నియోజకవర్గంలో.. జడ్పీ చైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం ఎదుట మురుగు నిలిచిపోయి నెల దాటింది. సమస్యలు చెప్పుకుందామని వచ్చే ప్రజలు మురుగులో నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. పలుమార్లు జడ్పీ చైర్‌పర్సన్‌ ఫిర్యాదు చేసినా.. కలెక్టర్‌ స్వయంగా ఆదేశించినా సంబంధిత కాంట్రాక్టర్‌ కానీ.. అధికారులు కానీ స్పందించడం లేదు. నెల దాటినా సమస్య అలాగే ఉంది.

ఎవరైతే మాకేంటి..!
మనోహరాబాద్‌లో జడ్పీచైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం ఎదుట నిలిచిన మురుగు

జడ్పీ చైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం ఎదుట మురుగు ప్రవాహం

జడ్పీ చైర్‌పర్సన్‌ కోరినా.. కలెక్టర్‌ ఆదేశించినా పట్టించుకోని కాంట్రాక్టర్‌, అధికారులు

నెల రోజులైనా పరిష్కారం కాని సమస్య


తూప్రాన్‌ (మనోహరాబాద్‌), నవంబరు 5: సీఎం సొంత నియోజకవర్గంలో.. జడ్పీ చైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం ఎదుట మురుగు నిలిచిపోయి నెల దాటింది. సమస్యలు చెప్పుకుందామని వచ్చే ప్రజలు మురుగులో నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. పలుమార్లు జడ్పీ చైర్‌పర్సన్‌ ఫిర్యాదు చేసినా.. కలెక్టర్‌ స్వయంగా ఆదేశించినా సంబంధిత కాంట్రాక్టర్‌ కానీ.. అధికారులు కానీ స్పందించడం లేదు. నెల దాటినా సమస్య అలాగే ఉంది. మెదక్‌ జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ హేమలతాశేఖర్‌గౌడ్‌ స్వగ్రామమైన మనోహరాబాద్‌ మండలకేంద్రంలో ఆమె క్యాంపు కార్యాలయం గేటు ఎదుట డ్రైనేజీ ధ్వంసం కావడంతో మురుగు రోడ్డుపైనే నిలిచింది. ఊర్లోని డ్రైనేజీ నీరంతా అక్కడే చేరడంతో అడుగుతీసి అడుగు పెట్టలేని పరిస్థితి. ఈ విషయాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ పలు పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యను తీర్చలేదు. దీంతో గతనెల 11న జడ్పీ సమావేశంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బురదలోనే బతుకమ్మ పండుగ చేసుకోవాలా? అని ప్రశ్నించారు. కలెక్టర్‌ ఆర్‌అండ్‌బీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయగా రెండ్రోజుల్లో  బాగుచేస్తామని వారు చెప్పారు. కానీ నెల గడిచినా సమస్య పరిష్కరించలేదు. జడ్పీ చైర్‌పర్సన్‌ క్యాంపు కార్యాలయం ఎదుటనే పరిస్థితి ఇలా ఉంటే ప్రజల సమస్యలు ఏం తీరుస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ ఏఈ రవీందర్‌రెడ్డిని వివరణ కోరగా  మురుగు ఎప్పుడో తొలగించామని పేర్కొనడం విడ్డూరం.

Updated Date - 2021-11-06T05:01:09+05:30 IST