కుకునూరుపల్లికి మండలం హోదా దక్కేనా?

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

మండలంలోని కుకునూరుపల్లి గ్రామం దాదాపు 18 గ్రామాలకు కూడలి కావడంతో పాటు కరీంనగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రోడ్డు అయిన రాజీవ్‌ రహదారిపై ఉండడంతో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

కుకునూరుపల్లికి మండలం హోదా దక్కేనా?
కుకునూరుపల్లి గ్రామం

సీఎం సానుకూల స్పందనతో చిగురిస్తున్న ఆశలు

సుమారు 18 గ్రామాలకు కూడలి

హోదా కోసం పరిసర గ్రామాల ప్రజల డిమాండ్‌

కొండపాక, జూన్‌ 22:  మండలంలోని కుకునూరుపల్లి గ్రామం  దాదాపు 18 గ్రామాలకు కూడలి కావడంతో పాటు కరీంనగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రోడ్డు అయిన రాజీవ్‌ రహదారిపై ఉండడంతో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం నియోజకవర్గం గజ్వేల్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ప్రస్తుతం కొండపాక మండలంలో ఉండడంతో కుకునూరు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కొన్నేళ్లుగా కుకునూరుపల్లిని మండల కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కూడా చేశారు. 

వీడని పట్టు

కొత్త మండలాల ఏర్పాటులో కుకునూరుపల్లికి స్థానం లేకపోవడంతో ఇక కాదేమోనని నిరాశ చెందారు. అయినప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా  మంత్రులు, అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ భగీరథయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత గ్రామ సర్పంచ్‌ పోల్కంపల్లి జయంతినరేందర్‌ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన నాయకులు, పరిసర గ్రామాల సర్పంచులు మండల కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ ఏ అవకాశాన్ని వదలకుండా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం సిద్దిపేట పర్యటనకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎలాగైనా తమ గోడు వినిపించాలని కుకునూరుపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నారు. ప్ల కార్డులు పట్టుకొని సీఎంకు తమ కోరికను తెలపాలనుకున్నారు.  సీఎం హెలికాప్టర్‌లో వెళ్లడంతో వారంతా కొద్దిసేపు రోడ్డుపై కుకునూరుపల్లి మండల కేంద్రం చేయాలని ఫ్లెక్సీలతో ప్రదర్శన చేశారు. కొండపాక మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు దేవి రవీందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ పి.అమరేందర్‌, సిద్దిపేట నూతన కలెక్టరేట్‌ వద్ద సీఎం కేసీఆర్‌ను కలిసి కుకునూరుపల్లిని మండల కేంద్రం చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్టు వారు పేర్కొన్నారు. సీఎం సానుకూల స్పందనతో ఈ ప్రాంత ప్రజల ఆశలు మళ్లీ చిగురించాయి.  

18 గ్రామాలకు అనుకూలం

కుకునూరుపల్లి మండలంగా చేస్తే 18 గ్రామాలకు అనుకూలంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తీర్మానాలు చేశారు. కొండపాక మండలంలోని గ్రామాలతో పాటు పరిసర మండలాల్లోని శివారు గ్రామాలు ఉన్నాయి. మేదినీపూర్‌, మంగోల్‌, మాత్‌పల్లి, చిన్నకిష్టాపూర్‌, ఎల్లాయిగూడెం, తిప్పారం, రామచంద్రపురం, కోనాయిపల్లి, బొబ్బాయిపల్లి, ముద్దాపూర్‌, కొడకండ్ల, హనుమాన్‌ నగర్‌, రాముని పల్లి, జంగంరెడ్డిపల్లి, గురువన్నపేట, తిమ్మారెడ్డిపల్లి, లకుడారం, అంతాయగూడెం గ్రామాలతో కలిపి కుకునూరుపల్లి మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST