కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దు

ABN , First Publish Date - 2021-10-20T05:04:45+05:30 IST

నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట సమీపంలో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేయవద్దంటూ మంగళవారం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం వద్దు
చిన్నచింతకుంటలో ధర్నా చేస్తున్న అఖిలపక్షం నాయకులు

 చిన్నచింతకుంట గ్రామస్థులకు  మద్ధతుగా అఖిలపక్షం నాయకుల ధర్నా

నర్సాపూర్‌, అక్టోబరు 19: నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంట సమీపంలో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేయవద్దంటూ మంగళవారం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. చిన్నచింతకుంట సమీపంలోని వ్యవసాయ పొలాల సమీపంలో కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడానికి పనులు మొదలు పెట్టడంతో, మూడురోజులుగా గ్రామస్థులు స్వచ్ఛందంగా ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామస్థులకు మద్దతుగా  కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం నాయకులు మంగళవారం చిన్నచింతకుంట సమీపంలో ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టనున్న స్థలం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్‌, బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగాయపల్లి గోపి, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి నాగరాజులు మాట్లాడుతూ పంచాయతీ నుంచి అనుమతులు లేకున్నా ప్రహరీ నిర్మాణం పనులు మొదలు పెట్టడం విచారకరమన్నారు. పచ్చటి పొలాల మధ్య  కెమికల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఎన్నో అనర్థాలు జరిగే అవకాశముందన్నారు. గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కొందరు పలుకుబడి గలవారి మద్దతుతో నిర్మాణం చేయాలనుకుంటే  మాత్రం అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామస్థులకు అండగా ఉండి ఫ్యాక్టరీ నిర్మాణం పనులు జరగకుండా అడ్డుకుంటామని వారు పేర్కొన్నారు.  కార్యక్రమంలో పెద్దచింతకుంట సర్పంచ్‌ శివకుమార్‌తో పాటు బీజేపీ జిల్లా నాయకులు సురేష్‌, వాల్దాస్‌ మల్లేశ్‌గౌడ్‌, అంజిగౌడ్‌, రెడ్డిపల్లి ఉపసర్పంచ్‌ అశోక్‌తో తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T05:04:45+05:30 IST