కాలుష్యకారక పరిశ్రమతో మా ప్రాంతాన్ని కలుషితం చేయొద్దు
ABN , First Publish Date - 2021-10-30T04:18:53+05:30 IST
నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట సమీపంలో కాలుష్యకారక పరిశ్రమ ఏర్పాట్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు.

చిన్నచింతకుంట వాసుల ఆందోళన, కాంగ్రెస్ మద్దతు
జాతీయ రహదారిపై రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్
నర్సాపూర్, అక్టోబరు 29: నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట సమీపంలో కాలుష్యకారక పరిశ్రమ ఏర్పాట్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేశారు. చిన్నచింతకుంట సమీపంలో కొన్ని రోజులుగా కాలుష్య పరిశ్రమ ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతుండటాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్థులు అక్కడ నిర్మిస్తున్న ప్రహరీ నిర్మాణాన్ని ఆపడమే కాకుండా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాలుష్య పరిశ్రమతో తమ ప్రాంతం కలుషితమై పెనుముప్పు వాటిల్లుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామస్థులంతా పార్టీలకతీతంగా అధికార పార్టీ నాయకులతో సహా జాతీయ రహదారిపై గంటకుపైగా రాస్తారోకో చేశారు. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సీఐ లింగేశ్వరరావు, ఎస్‌ఐ గంగరాజు తన సిబ్బందితో అక్కడకు వెళ్లి వారికి నచ్చజెప్పేందుకు యత్నించారు. ఆందోళనకారులు ససేమిరా అనడంతో బలవంతంగా వారిని తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గ్రామస్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆంజనేయులుగౌడ్, ఎంపీపీ జ్యోతిసురేష్, మాజీ ఎంపీపీ శ్రీనివా్‌సగౌడ్, ఎంపీపీ ఉపాధ్యక్షులు నర్సింగ్‌రావు కూడా పాల్గొన్నారు.