అర్ధశతాబ్దపు భూ హక్కులకు సీలింగ్‌ గండం

ABN , First Publish Date - 2021-11-03T04:54:01+05:30 IST

అర్ధశతాబ్ద కాలంగా సాగు చేసుకుంటున్న పట్టా భూములపై సీలింగ్‌ ముద్ర వేయడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని ఏడు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది సీలింగ్‌ భూములనే అంశం ఎనిమిది నెలల క్రితమే తెరపైకి తెచ్చారని, దీంతో తమ భూములను విక్రయించే హక్కు లేకుండా చేశారని ఆవేదన చెందుతున్నారు. పట్టాలు కలిగిన తమ భూములను సీలింగ్‌ భూముల విభాగం నుంచి విముక్తి చేయాలని మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

అర్ధశతాబ్దపు భూ హక్కులకు సీలింగ్‌ గండం

1,097 ఎకరాలు సీలింగ్‌ భూములుగా తేల్చిన రెవెన్యూ శాఖ

దొరల వద్ద కొనుగోలు చేసిన రైతులు

మూడు తరాలుగా సాగు 

ఎనిమిది నెలల క్రితం వివాదం

ఆందోళనలో ఏడు గ్రామాల రైతులు


హుస్నాబాద్‌, నవంబరు 2 : అర్ధశతాబ్ద కాలంగా సాగు చేసుకుంటున్న పట్టా భూములపై సీలింగ్‌ ముద్ర వేయడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని ఏడు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది సీలింగ్‌ భూములనే అంశం ఎనిమిది నెలల క్రితమే తెరపైకి తెచ్చారని, దీంతో తమ భూములను విక్రయించే హక్కు లేకుండా చేశారని ఆవేదన చెందుతున్నారు. పట్టాలు కలిగిన తమ భూములను సీలింగ్‌ భూముల విభాగం నుంచి విముక్తి చేయాలని మంత్రులు, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మీర్జాపూర్‌, ఉమ్మాపూర్‌ రెవెన్యూ గ్రామాల పరిధిలోని జిల్లెలగడ్డ, వంగరామయ్యపల్లి, భల్లునాయక్‌తండా, పూల్‌నాయక్‌తండా, నాగారం గ్రామాల్లో దాదాపు 7 వేల ఎకరాలకు పైగా భూములున్నాయి. ఇందులో 400 మంది రైతులకు చెందిన 1,097 ఎకరాలు సీలింగ్‌ భూములుగా నమోదయ్యాయి. 


50 సంవత్సరాలుగా సాగు

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం ఆకునూర్‌ గ్రామానికి చెందిన దొరలు జీర్లపల్లి రంగారావు, కొండల్‌రావు, రాంచందర్‌రావు, రాజేశ్వరీదేవి, సీలింగ్‌ యాక్ట్‌ 1975 అమలులోకి వచ్చిన అనంతరం మీర్జాపూర్‌, ఉమ్మాపూర్‌ రెవెన్యూ పరిధిలోని 1,600 ఎకరాల అదనపు భూమిని ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. ఇందులో కొంత భూమిని తాము కొనుగోలు చేశామని కొందరు రైతులు ల్యాండ్‌ ట్రిబ్యునల్‌కు అప్పిలేట్‌కు వెళ్లారు. విచారణ అనంతరం 503 ఎకరాలను వారికి అప్పగించిన ప్రభుత్వం, మిగిలిన 1,097 ఎకరాలను స్వాధీనం చేసుకున్నది. కానీ ఈ 1,097 ఎకరాల భూమిని సీలింగ్‌ భూమిగా రెవెన్యూ రికార్డులకు మాత్రం ఎక్కలేదు. ఈ భూములను యజమానులైన దొరలు తమకు విక్రయించారని పేర్కొంటూ మీర్జాపూర్‌, ఉమ్మాపూర్‌ రెవెన్యూ గ్రామాల్లోని వంగరామయ్యపల్లి, జిల్లెలగడ్డ, భల్లునాయక్‌తండా, పూల్‌నాయక్‌తండా, నాగారం గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. వారికి పట్టా పాస్‌బుక్కులు కూడా వచ్చాయి. క్రయవిక్రయాలు జరుగుతూ యాభై ఏళ్లలో ఎంతోమంది చేతులు మారాయి. ప్రస్తుత యజమానులు భూములపై బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. రైతుబంధు వంటి ప్రభుత్వ పథకాలను కూడా పొందుతున్నారు. ఎనిమిది నెలల క్రితం కొందరు వ్యక్తుల మధ్య వివాదం తెలత్తడంతో ఈ భూములపై కోర్టుకు వెళ్లారు. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఈ భూములను సీలింగ్‌ భూములని పేర్కొంటూ ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. 50 సంవత్సరాలుగా లేని సీలింగ్‌ అంశం ఇప్పడు ఎలా వచ్చిందని ఏడు గ్రామాల రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టు తిరుగుతున్నారు. ఆడపిల్లల వివాహాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ అవసరాల నిమిత్తం భూములను విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. 


ప్రభుత్వానికి నివేదించాం : జయచంద్రారెడ్డి, ఆర్డీవో, హుస్నాబాద్‌  

1,097 ఎకరాలు సీలింగ్‌ భూమి అయినప్పటికీ రికార్డుల్లో మాత్రం ప్రభుత్వ భూమి అని నమోదు కాలేదు. ఈ భూముల్లో రైతులు 40 సంవత్సరాలకు పైగా మోఖాలో ఉంటూ సాగు చేసుకుంటున్నారు. వారికి పాసుబుక్కులు కూడా ఉన్నాయి. పలుమార్లు క్రయవిక్రయాలు జరగడంతో పలువురి చేతులు మారాయి. ఈ భూములపై సమస్యను ప్రభుత్వానికి నివేదించాం.


సమస్యను పరిష్కరించాలి : విజయలక్ష్మి, సర్పంచ్‌, వంగరామయ్యపల్లి 

50 సంవత్సరాలుగా మూడు తరాలవారు ఈ భూములను సాగుచేసుకుంటున్నారు. అన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు సీలింగ్‌ భూములని అంటున్నారు. దీంతో దాదాపు 400 మంది ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి.

Updated Date - 2021-11-03T04:54:01+05:30 IST