‘ధరణి’ విప్లవాత్మకమైన నిర్ణయం

ABN , First Publish Date - 2021-10-30T04:33:37+05:30 IST

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ధరణి పోర్టల్‌ తీసుకురావడం ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలియజేశారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

‘ధరణి’ విప్లవాత్మకమైన నిర్ణయం



ప్రారంభమై సంవత్సరం పూర్తి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

సీఎం కేసీఆర్‌ పట్టుదలతో భూ రికార్డులకు భద్రత

ధరణి పోర్టల్‌ దేశానికే ఆదర్శం

కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


సిద్దిపేట అగ్రికల్చర్‌, అక్టోబరు 29 : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ధరణి పోర్టల్‌ తీసుకురావడం ఒక విప్లవాత్మకమైన నిర్ణయమని కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి తెలియజేశారు. ధరణి పోర్టల్‌ను ప్రారంభించి సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆయన కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంవత్సర కాలంలోనే భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతం కావడానికి ధరణి ఎంతగానో దోహదపడిందని గుర్తుచేశారు. రిజిస్ట్రేషన్లను సులభతరం చేసిందని తెలిపారు. ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన భూములకు భద్రత, భరోసా ఉంటుందని పేర్కొన్నారు. 40 ఏళ్ల నుంచి ఎన్నో విధాలుగా భూమి పంచాయితీలు, అభద్రత, ఇతరత్రా వివాదాలకు దీంతో తెరపడిందని కలెక్టర్‌ అన్నారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు చేయకుండా పకడ్బందీ వ్యూహంతో ధరణి రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు. అతి తక్కువ సమయంలోనే సీఎం కేసీఆర్‌ పట్టుదలతో భూ వివాదాలకు పరిష్కారం చూపారని, భూ రికార్డులకు భద్రత కల్పించారని తెలిపారు. ధరణి పోర్టల్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలియజేశారు. రోజువారీగా 100 నుంచి 150 దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. రానున్న 2, 3 మాసాల్లో ధరణితో అన్నీ పరిష్కారమవుతాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ధరణి పరిశీలనకు ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు వస్తారని, ఇప్పటికే పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు విషయ సేకరణ జరుపుతున్నట్లు కలెక్టర్‌ వివరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ధరణి పట్ల జిల్లా రైతుల తరఫున, జిల్లా అధికార యంత్రాంగం తరఫున సీఎం కేసీఆర్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ధరణి పోర్టల్‌ విజయవంతంగా అమలు చేయడంపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. జిల్లాలో ధరణి పోర్టల్‌ ద్వారా 1,23,696 లావాదేవీలు జరిగిట్లు తెలిపారు. 41,167 భూమి రిజిస్ట్రేషన్లు, 5,134 వారసత్వ భూ తగాదాలు పరిష్కరించబడినట్లు పేర్కొన్నారు. 40,180 ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. నిషేధిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను నెలరోజుల్లో పరిష్కరించేందుకు గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


Updated Date - 2021-10-30T04:33:37+05:30 IST