పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో రాజేష్‌

ABN , First Publish Date - 2021-08-28T05:20:03+05:30 IST

సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న సందర్భంగా శుక్రవారం నారాయణఖేడ్‌, సిర్గాపూర్‌ మండలాల్లోని పలు పాఠశాలలను డీఈవో నాంపల్లి రాజేష్‌ తనిఖీ చేశారు.

పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో రాజేష్‌
నారాయణఖేడ్‌లో ఉపాధ్యాయులకు సూచనలిస్తున్న డీఈవో

పాఠశాలల్లో పరిశుభ్రతపై పలు సూచనలు 

మంగల్‌పేటలోని ప్రాథమిక పాఠశాల గోడలపై బూజు తొలగించకపోవడంపై అసంతృప్తి

పాఠశాలల నిర్వహణ తీరుపై జడ్పీ సీఈవో మండిపాటు 

నారాయణఖేడ్‌/కల్హేర్‌/నాగల్‌గిద్ద/జిన్నారం, ఆగస్టు 27 : సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానున్న సందర్భంగా శుక్రవారం నారాయణఖేడ్‌, సిర్గాపూర్‌ మండలాల్లోని పలు పాఠశాలలను డీఈవో నాంపల్లి రాజేష్‌ తనిఖీ చేశారు. సిర్గాపూర్‌ మండల పరిఽధిలోని వాసర్‌, సిర్గాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, సిర్గాపూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కడ్పల్‌ ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఖేడ్‌ పట్టణంలోని మంగల్‌పేట, నెహ్రునగర్‌ ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంగల్‌పేటలోని ప్రాథమిక పాఠశాలలో గోడలకు ఉన్న బూజును తొలగించకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన వెంట ఖేడ్‌, సిర్గాపూర్‌ ఎంఈవోలు విశ్వనాథ్‌, శంకర్‌, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. నాగల్‌గిద్ద మండల కేంద్రంలో గల జడ్పీ ఉన్నత ప్రాథమిక పాఠశాలను తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రత ఉండేటట్లు చూసుకోవాలని హెచ్‌ఎం భాస్కర్‌కు సూచించారు. ఆయన వెంట టీపీటీఎఫ్‌ అధ్యక్షుడు రమేష్‌ తదితరులు ఉన్నారు. పాఠశాలల ప్రారంభోత్సవానికి స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని డీఎల్‌పీవో సతీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాలను ఆయన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రోజారాణి, కౌన్సిలర్లు బీరప్ప, శైలజతో కలిసి పరిశీలించారు. 

మెదక్‌ జిల్లాలో

తూప్రాన్‌రూరల్‌/కొల్చారం/హవేళీఘణపూర్‌, ఆగస్టు 27 : తూప్రాన్‌ మండలంలోని కిష్టాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో స్థానిక కూలీలచేత శుక్రవారం తరగతి గదులను కడిగి, పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీవో రమేష్‌ పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు. పాఠశాలల నిర్వహణ తీరుపై జడ్పీ సీఈవో శైలేష్‌ అధికారులపై మండిపడ్డారు. శుక్రవారం కొల్చారం మండలంలోని పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ముందు ఉన్న వర్షపు నీటి గుంతలు, కిటికీలు లేకపోవడంపై మండలస్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హవేళీఘణపూర్‌లోని పాఠశాలల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పరిశుభ్రత, శానిటైజేషన్‌ పనులు నిర్వహించారు. 

వసతి గృహంలో పరిశుభ్రత కరువు

చిన్నశంకరంపేట, ఆగస్టు 27 : సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభంకానుండడంతో మండల కేంద్రంలోని గిరిజన వసతి గృహం, ఎస్సీ వసతి గృహం, కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం, ఆదర్శ పాఠశాల వసతి గృహాలు పరిశుభ్రతకు నోచుకోవడం లేదు. ఎస్టీ హాస్టల్‌లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి అపరిశుభ్రత నెలకొన్నది. ఇకనైనా అధికారులు హాస్టళ్లను సందర్శించి పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Updated Date - 2021-08-28T05:20:03+05:30 IST