ఆస్తి కోసం తల్లిని చంపిన కూతురు

ABN , First Publish Date - 2021-12-18T05:41:27+05:30 IST

మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండలంలో బుధవారం రాత్రి జరిగిన హత్య మిస్టరీ వీడింది. ఆస్తి కోసం కూతురే తల్లిని హత్య చేసినట్లు తేలింది.

ఆస్తి కోసం తల్లిని చంపిన కూతురు

మద్యం తాగించి.. స్లాబ్‌పై నుంచి తోసేసి.. ఆపై బండరాయితో బాది హత్య

హత్య వివరాలను వెల్లడించిన మెదక్‌ డీఎస్పీ సైదులు

హవేళీఘణపూర్‌, డిసెంబరు 17: మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండలంలో బుధవారం రాత్రి జరిగిన హత్య మిస్టరీ వీడింది. ఆస్తి కోసం కూతురే తల్లిని హత్య చేసినట్లు తేలింది. కన్నతల్లి అని చూడకుండా మద్యం తాగించి స్లాబ్‌పై నుంచి కిందికి తోసేసి, ఆపై బండరాయి, కర్రలతో తలపై కొట్టి హత్య చేసింది. శుక్రవారం మెదక్‌ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండల పరిధిలోని తొగిట గ్రామానికి చెందిన పుస్తి బాలమణి (50), కిషన్‌ దంపతులు. వీరికి ఒక్కగానొక్క కూతురు పుస్తి నర్సమ్మకు ఇదే గ్రామానికి చెందిన ఎలబోయిన లచ్చయ్యతో వివాహం జరిపించి ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. లచ్చయ్య రెండు సంవత్సారాల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే, కూతురు నర్సమ్మ పనికి వెళ్లి ఇంటికి ఆలస్యంగా వస్తే అనుమానంతో బాలమణి దూషించేది. అంతేకాకుండా బాలమణి పేరున గ్రామంలో ఉన్న 16 గుంటల భూమి తన పేర చేయించడం లేదని నర్సమ్మ తల్లిపై కసి పెంచుకుంది. తల్లిని చంపేస్తేనే తనకు వేధింపులు తప్పడంతో పాటు, ఆస్తి వస్తుందని గ్రహించింది. ఈ క్రమంలోనే తండ్రి కిషన్‌ ఇంట్లో మూడురోజులుగా లేకపోవడంతో తల్లిని హత్య చేసేందుకు ప్లాన్‌ వేసింది. బుధవారం రాత్రి స్లాబ్‌ మీదకు తల్లిని తీసుకెళ్లి మద్యం తాగించింది. కిందకు వేళ్లేందుకు తూలుతూ లేచిన తల్లిని స్లాబ్‌ పైనుంచి తోసేసింది. వెంటనే నర్సమ్మ కిందకు వచ్చి చూడగా బాలమణి ప్రాణాలతోనే ఉంది. బతికితే విషయం బయటపడుతుందని బండరాయితో తలపై గట్టిగా బాదింది. అయినా చావకపోవడంతో కర్రతో తలపై బలంగా కొట్టింది. చనిపోయిందని నిర్ధారణ చేసుకున్న అనంతరం.. తన తల్లి మద్యం సేవించి స్లాబ్‌ పైనుంచి కిందపడి చనిపోయిందని కుటుంబీకులను, ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. బాలమణి సోదరుడు సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. డాగ్‌స్క్వాడ్‌ క్లూస్‌ టీం సహాయంతో పోలీసులు అనుమానితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆస్తి కోసం తానే హత్య చేసినట్లు నర్సమ్మ ఒప్పుకుందని డీఎస్పీ సైదులు తెలిపారు. నర్సమ్మపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో మెదక్‌ రూరల్‌ సీఐ పాలవెల్లి, ఎస్‌ఐలు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-18T05:41:27+05:30 IST