యాప్ లింక్ పంపి రూ.25 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ABN , First Publish Date - 2021-12-31T17:15:16+05:30 IST
ధాన్యం డబ్బు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళా రైతు, ఆమె కుమారుడిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.25 వేలు కాజేసిన సంఘటన తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్‌లో గురువారం చోటు చేసుకున్నది.

తూప్రాన్, డిసెంబరు 30 : ధాన్యం డబ్బు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళా రైతు, ఆమె కుమారుడిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి రూ.25 వేలు కాజేసిన సంఘటన తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్‌లో గురువారం చోటు చేసుకున్నది. బాధితుల వివరాల మేరకు అల్లాపూర్‌కు చెందిన మన్నె యశోద ఇటీవల కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యాన్ని విక్రయించింది. వాటికి సంబంధించిన డబ్బు కోసం ఎదురుచూస్తుండగా గురువారం ఆమె మొబైల్ ఫోన్‌కు రూ.25 వేలు నగదు వచ్చినట్లుగా ఓ యాప్ లింక్‌తో కూడిన మెస్సేజ్ వచ్చింది. ధాన్యం అమ్మకం డబ్బు వస్తున్నట్లుందని యశోద కుమారుడు స్వామి యాప్ లింక్ ఇచ్చిన వ్యక్తిని సంప్రదించాడు. ఆ సైబర్ నేరగాడు స్వామిని మాటల్లో పెట్టి డబ్బు పంపేందుకు గూగుల్‌పే, ఫోన్‌పే ఉందా? అంటూ ప్రశ్నించాడు. లేదంటూ చెప్పడంతో ఇవి ఉన్న నంబరు ఇవ్వాలని సైబర్ నేరగాడు సూచించాడు. దీంతో స్వామి తన సోదరుడు మన్నె నర్సింహులు ఫోన్ నంబరు ఇచ్చాడు. తనకొచ్చిన యాప్ లింక్‌ను స్వామి నర్సింహులుకు పంపించాడు. స్వామి సూచించినట్లుగా నర్సింహులు యాప్‌ను ఓపెన్ చేసి పాస్‌వర్డు ఎంటర్ చేయడంతో అతడి ఖాతాకు డబ్బు రాకపోగా, రూ.25 వేలు డెబిట్ అయ్యాయి. దీంతో మోసపోయామని గ్రహించిన వీరు సైబర్ నేరగాడి ఫోన్ నంబర్‌ను సంప్రదించగా స్పందించలేదు. వెంటనే వారు తూప్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.