పేదరికంతో ప్రాణం పోవద్దు

ABN , First Publish Date - 2021-03-22T05:51:37+05:30 IST

పేదరికం కారణంగా ఖరీదైన వైద్యానికి దూరమై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారి కష్టాలను తీర్చడానికే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

పేదరికంతో ప్రాణం పోవద్దు
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఎంత పెద్ద వైద్యమైనా ఉచితంగానే..

సిద్దిపేట సర్కారు ఆస్పత్రిలో సకల సౌకర్యాలు 

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి 21: పేదరికం కారణంగా ఖరీదైన వైద్యానికి దూరమై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారి కష్టాలను తీర్చడానికే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో సీటీ స్కానింగ్‌ సెంటర్‌, 20 పడకల అత్యాధునిక ఐసీయూ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంత పెద్ద వైద్యమైనా ఉచితంగా అందించే విధంగా ఆస్పత్రిని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. రూ.5.45 కోట్ల వ్యయంతో సీటీ స్కాన్‌, 20 పడకల ఐసీయూ, 20 వెంటిలేటర్లు, వెయిటింగ్‌ హాల్‌, లిఫ్టును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే సిద్దిపేట ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో సుమారు 20వేల రక్త నమూనాలు సేకరించి, 99 వేలకు పైగా టెస్టులు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే అన్ని వసతులు ఉన్నందున ప్రైవేట్‌కు ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఉచిత వైద్య సేవలతో పేదలకు కోట్లాది రూపాయలు మిగులుతున్నాయని వివరించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు సీటీ స్కాన్‌ పరీక్షలు చేసుకోగా మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ పాల సాయిరాం, ఆస్పత్రి డైరెక్టర్‌ తమిళ అరసి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో 103 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.6.30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీలేని రుణ మంజూరు ధ్రువీకరణ పత్రాలను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. అనంతరం మంత్రి సిద్దిపేట పట్టణంలోని విపంచి నిలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 


కోనాయపల్లి  బెడ్‌రూంల ప్రారంభం

నంగునూరు, మార్చి 21 : నంగునూరు మండలం కోనాయపల్లిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను  ఆదివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. లబ్ధిదారులను గృహప్రవేశం చేయించి ఇంటి ధ్రువీకరణ పత్రాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.  మండలంలోని 110 మంది లబ్ధిదారులకు రూ. 11 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు. అనంతరం కోనాయపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేశం, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, రాధాకృష్ణశర్మ, కొమురవెల్లి ఆలయ కమిటీ చైర్మన్‌ మల్లయ్య, నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, ఎల్లంకి మహిపాల్‌రెడ్డి, కోల రమే్‌షగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లింగంగౌడ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


విత్తనోత్పత్తి గ్రామంగా ఇబ్రహీంపూర్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌ , మార్చి 21 : వచ్చే వానకాలంలో ఇబ్రహీంపూర్‌ గ్రామాన్ని విత్తనోత్పత్తి గ్రామంగా అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో శిక్షణ పొందిన సీడ్స్‌, పెస్టిసైడ్స్‌, ఫర్టిలైజర్‌ డీలర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎరువులు, క్రిమిసంహరకాలు ఎక్కువగా వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల గురించి ఆలోచన చేస్తూ అధిక దిగుబడికి ఎరువుల వాడకం  అవసరం మేర వాడాలని, అధిక మోతాదులో వాడొద్దని రైతులను చైతన్యపర్చాలని డీలర్లకు మంత్రి సూచించారు. ఈ నెల 28న ఆయిల్‌ ఫామ్‌ సాగుపై రెండువేల మంది రైతులతో వ్యవసాయ శాఖ మంత్రితో సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌ను మంత్రి ఆదేశించారు.  త్వరలోనే చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ గ్రామ రైతులతో కలిసి సెరి కల్చర్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌ కోసం మైసూర్‌ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ఆయిల్‌ ఫామ్‌ సాగుపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గంలోని తోర్నాల, బుస్సాపూర్‌, ఇర్కోడ్‌, చిన్నగుండవెళ్లి, ఎల్లుపల్లి, నాంచారుపల్లి, మందపల్లి, మల్లారం గ్రామాల్లో 500 ఎకరాల్లో తెలంగాణ సోనా ధాన్యం పండించేందుకు దక్కన్‌ ముద్ర కంపెనీ ప్రతినిధులు మంత్రి సమక్షంలో రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జిల్లా సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.


శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం

గజ్వేల్‌, మార్చి 21: గజ్వేల్‌ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు 14 శాతం లోపు తేమ ఉండేలా ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఆయన వెంట ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, నాయకులు యాదవరెడ్డి, శ్రీనివాస్‌, ఎలక్షన్‌రెడి ్డ, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ జకీయొద్దీన్‌, మార్కెట్‌ కార్యదర్శి జాన్‌వెస్లీ ఉన్నారు.

Updated Date - 2021-03-22T05:51:37+05:30 IST