పంటల మునక
ABN , First Publish Date - 2021-07-24T05:47:25+05:30 IST
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

ఎడతెరిపిలేని వర్షాలకు పొలాల్లో చేరిన నీరు
మరో రెండు రోజులు కొనసాగితే పంటలకు నష్టమే
ఇప్పటికే మెదక్ జిల్లాలో 300 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
కూలిన వందకు పైగా ఇళ్లు, కొన్ని పాక్షికంగా ధ్వంసం
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో జిల్లాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోకి నీరు చేరాయి. వర్షాలు ఇలానే కొనసాగితే పత్తి, కంది,మొక్కజొన్న, సోయా పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో 300 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వందకుపైగా ఇళ్లు నేలకూలాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులు కోతకు గురయ్యాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 23: మూడు రోజులుగా కురిసిన వర్షాలతో సంగారెడ్డి, నారాయణఖేడ్, కోహీర్, తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న, సోయా, పత్తి చేనులో నీరు చేరింది. ఇలాగే మరో రెండు లేదా మూడు రోజులు కొనసాగితే పత్తి, కంది, మొక్కజొన్న, సోయా పంటలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.
గత నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో సగటున 285.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 420.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 53 రోజుల్లో 31 రోజుల పాటు వర్షం కురిసింది. జిల్లాలోని 27 మండలాల్లో ఎనిమిది మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. కంగ్టి, సిర్గాపూర్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లో అత్యధికంగా వర్షం కురియగా, మరో 12 మండలాల్లోనూ వర్షం కాస్త ఎక్కువగానే పడింది. ఏడు మండలాల్లో మాత్రం సాధారణస్థాయిలో వర్షం కురిసింది. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో సగటున 1.22 సెంటీమీటర్ల వర్షం కురవగా, అత్యధికంగా గుమ్మడిదల మండలంలో 2.7 సెంటీమీటర్లు కురిసింది.
సింగూరుకు కొనసాగుతున్న వరద
వర్షాకాలం సీజన్ ప్రారంభమైన 15 రోజుల తర్వాత సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు రావడం మొదలైంది. మంజీర పరివాహక ప్రాంతంలో వర్షాలు కురియడంతో ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం ప్రారంభమైంది. గత నెల 16న 9,840 క్యూసెక్కుల నీళ్లు సింగూరు ప్రాజెక్టులోకి వచ్చి చేరాయి.
సింగూరు ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 523.600 మీటర్లకు 29.97 టీఎంసీలు. అయితే జూన్ 16న వచ్చిన 840 క్యూసెక్కుల నీటితో సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం 520.807 మీటర్లస్థాయిలో 17.582 టీఎంసీలుగా నమోదైంది. ఆ తర్వాత విస్తారంగా పడిన వర్షాలతో ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులోకి 19.864 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. శుక్రవారం ప్రాజెక్టులోకి 4,394 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది.
300 ఎకరాల్లో నష్టం
ఆంధ్రజ్యోతిప్రతినిఽధి,మెదక్/తూప్రాన్/తూప్రాన్‌రూరల్/నిజాంపేట/చేగుంట/ రామాయంపేట/చిన్నశంకరంపేట/నర్సాపూర్, జూలై 23: ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో మెదక్ జిల్లాలో 300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా పడిన వానలకు పంటలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. చిన్నశంకరంపేట, మెదక్, హవేళీఘనపూర్, టేక్మాల్ మండలాల్లో ఎక్కువగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. శుక్రవారం ఉదయం నుంచి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పర్యటించి పంట నష్టంపై ఆరా తీశారు. జిల్లాలోని ప్రధాన జలాశయాలు నిండుకుండలా మారాయి. వర్షాలదాటికి చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. నిజాంపేట మండలం కాసీంపూర్ తండా పులి చెరువుకుంట కట్టతెగిపోయింది. పంట పొలాలు నీటితో నిండిపోయాయి. చల్మెడవాగు పొంగిపొర్లుతోంది. రామాయాంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌లో రోడ్డు తెగి ఆరు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. విరిగిన ఎముకలకు ఝాన్సీలింగాపూర్‌లో కట్టు కట్టించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరుగుముఖం పడుతున్నారు. మెదక్ - కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో పోచారం ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. కొల్చారం మండలంలోని మహబూబ్‌నహర్ కాలువ దిగువన భారీగా వరద నీరు వచ్చింది. రాంపూర్, కిష్టాపూర్‌లో పంటలన్నీ నీట మునిగాయి. నర్సాపూర్ మండలంలో కురిసిన వర్షాలకు పొలాల్లోకి వరద నీరు చేరింది.
కూలిన ఇళ్లు
వరుసగా కురుస్తున్న వానలకు జిల్లాలోని పలు చోట్ల వందకుపైగా ఇళ్లు నేలకూలినట్లు అధికారులు చెబుతున్నారు. పాత గోడలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కౌడిపల్లిలో జడ్పీటీసీ కవిత ఇల్లు కూలింది. ఇందులో ఎవరూ నివసించకపోవడంతో ప్రమాదం తప్పింది.
తూప్రాన్ డివిజన్‌లో కురిసిన ముసురు వర్షానికి 45 ఇళ్లు దెబ్బతిన్నట్లు తూప్రాన్ రెవెన్యూ డివిజన్ అధికారి శ్యాంప్రకాశ్ పేర్కొన్నారు. తూప్రాన్ డివిజన్ పరిధిలోని తూప్రాన్ మండలంలో 16 ఇళ్లు, చేగుంట మండలంలో 10, నార్సింగి మండలంలో 9, వెల్దుర్తి మండలంలో 5, మనోహరాబాద్ మండలంలో 4, మాసాయిపేట మండలంలో ఒక ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నది. తూప్రాన్ రూరల్ మండలంలో శుక్రవారం వరకు 24 ఇళ్లు ధ్వంసమైనట్లు తహసీల్దార్ శ్రీదేవి తెలిపారు. గుండ్రెడ్డిపల్లిలో 5, వెంకటాయపల్లిలో 4, నాగులపల్లిలో 3, కిష్టాపూర్‌లో 4, తూప్రాన్‌లో 4, పడాలపల్లిలో 2, నర్సంపల్లి, మల్కాపూర్‌లలో ఒక్కోటి చొప్పున పెంకుటిళ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. చిన్నశంకరంపేటకు చెందిన చిన్నపట్లోరి దత్తు ఇల్లు కూలింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.
నిండిన 163 చెరువులు
మెదక్ నీటిపారుదల సర్కిల్ పరిధిలోని నర్సాపూర్, మెదక్, దుబ్బాక, గజ్వేల్, సబ్‌డివిజన్ల పరిధిలో మొత్తం 2,060 చెరువులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 163 చెరువులు నిండుకుండలా మారాయి. 77 చెరువులు అలుగు పారుతున్నాయి. 446 చెరువుల్లో 75 శాతం నీరు వచ్చి చేరింది. 729 చెరువులు 50 శాతం నిండాయి. 645 చెరువుల్లోకి 25 శాతంపైగా నీరు చేరింది. చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, గవ్వలపల్లి, గజగట్లపల్లి, టీ.మాందాపూర్ తదితర గ్రామాల్లోని చెరువులు వరద నీటితో అలుగు పారి జలకళను సంతరించుకున్నాయి. నర్సాపూర్ రాయరావు చెరువు నిండుకుండలా మారింది. చుట్టూ ఎతైన గుట్టలు, పచ్చని చెట్ల నడుమ ఎంతో ఆహ్లాదంగా ఉండే రాయరావు చెరువులో నీరు నిండడంతో ప్రకృతి అందాలను చూడడానికి స్థానికులు పెద్దఎత్తున వస్తున్నారు. చేగుంట, నార్సింగి మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు కుంటలు వర్షాలకు నిండి అలుగు పారుతున్నాయి. చేగుంట విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఎదురుగా జాతీయ రహదారి సైడ్‌బర్మ్ వరద నీటి ధాటికి కోతకు గురైంది.
నార్సింగి మండలంలో 7.48సెం.మీ. వర్షపాతం
మెదక్ జిల్లాలో అత్యధికంగా నార్సింగి మండలంలో 7.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజాంపేట మండలంలోనూ 7 సెంటీమీటర్లు పడింది. మెదక్, శివ్వంపేట, మాసాయిపేట, చేగుంట 3 సెంటీమీటర్లు, వెల్దుర్తి, నర్సాపూర్, కౌడిపల్లి, తూప్రాన్‌లో 2 సెంటీమీటర్లు, అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, పెద్దశంకరంపేట, మనోహరాబాద్, చిల్‌పచెడ్, కొల్చారం, మనోహరాబాద్‌లో సెంటీమీటర్‌కుపైగా వర్షం పడింది.


