సిద్దిపేటలో నకిలీ నోట్ల కలకలం

ABN , First Publish Date - 2021-08-21T06:17:15+05:30 IST

హైదరాబాద్‌లో జరిగిన నకిలీ నోట్ల చెలామణిలో సిద్దిపేట పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అరెస్టు కావడంతో పట్టణంలో కలకలం రేగింది.

సిద్దిపేటలో నకిలీ నోట్ల కలకలం

 ఈజీ మనీ కోసం యువత పెడదారి

సిద్దిపేట క్రైం, ఆగస్టు 20: హైదరాబాద్‌లో జరిగిన నకిలీ నోట్ల చెలామణిలో సిద్దిపేట పట్టణానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అరెస్టు కావడంతో పట్టణంలో కలకలం రేగింది.  పట్టణంలోని భారత్‌నగర్‌కు చెందిన చుక్కపురం సంతోష్‌ కుమార్‌ ఎంబీఏ పూర్తి చేసుకొని పట్టణంలో బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. సొంతంగా ల్యాబ్‌ పెట్టుకోవాలనుకోవడంతో పెద్దమొత్తం డబ్బు అవసరమవుతాయని భావించారు.  ఈజీగా డబ్బు సంపాదించుకోవాలనే ఆశతో వివేకానంద కాలనీలో ఉంటూ కొరియర్‌గా పని  చేస్తున్న జానకి సాయికుమార్‌తో కలిసి దొంగ నోట్లు ముద్రించుకోవాలని నిర్ణయించుకున్నారు. ముద్రించిన నోట్లను చెలామణి చేయడానికి వివేకానంద కాలనీకి చెందిన మరో వ్యక్తి శ్రీనివా్‌సను వారితో కలుపుకున్నారు. శ్రీనివాస్‌ బీఎ్‌సఎ్‌ఫలో పని చేసి డిస్మిస్‌ అయి సిద్దిపేటకు వచ్చి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవలే పెళ్లి కూడా జరిగింది. పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ  మొదటి సంవత్సరం చదువుతున్న నీరజ్‌కుమార్‌, మరో వ్యక్తి  జలిగం రాజు కూడా పై ముగ్గురికి జత కలిశారు. దీంతో ఐదుగురు  కలిసి దొంగ నోట్ల వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు. 


రూ. 500 నోటు అసలుకు..  3 రేట్ల నకిలీ

ఇందుకోసం సిద్దిపేటలో  ఒక రూమ్‌ను అద్దెకు తీసుకొని మొదటగా రెండు నకిలీ 500  నోట్లు ప్రింట్‌ చేసి  సిద్దిపేటలో చెలామణి చేయగా  ఎవరూ. గుర్తుపట్టలేదు. దీంతో ఎక్కువ మొత్తంలో ప్రింట్‌ చేద్దామని నిర్ణయించుకొని హైదరాబాద్‌లో ఒక ఒరిజినల్‌ నోటుకు 3 నకిలీ నోట్లు డీల్‌ మాట్లాడుకొని చెలామణి చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16లక్షలు నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం సిద్దిపేట పట్టణంలోని నిందితులు దొంగ నోట్లు తయారు చేసే రూమ్‌ను సోదాచేసి కంప్యూటర్‌, ప్రింటర్‌, పేపర్లను  స్వాధీనం చేసుకున్నారు.


విచారణ చేపట్టిన జిల్లా పోలీసులు!

దొంగనోట్ల విషయం తెలిసిన సిద్దిపేట పోలీసులు వెంటనే విచారణ చేపట్టినట్లు తెలిసింది. గతంలో కూడా సిద్దిపేట పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తులు నకిలీ నోట్లు చెలామణి చేసి పట్టుపడ్డారు. వారితో ఈ ఐదుగురికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ ఐదుగురు సిద్దిపేటలోని కొన్ని పెట్రోల్‌ బంక్‌లు, షాపింగ్‌  కాంప్లెక్స్‌లో  నకిలీ నోట్లు చెలామణి చేసినట్లు సమాచారం.  ఎప్పటి నుంచి ఈ దందా జరుగుతున్నదో,  ఎవరెవరికి సంబంధం ఉందోననే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. నకిలీ నోట్ల చలామణిలో సిద్దిపేటకు చెందిన వ్యక్తులు హైదరాబాద్‌లో పట్టుపడడంతో పట్టణంలోని వ్యాపారస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఐదుగురు వ్యక్తులు పట్టణంలో చలామణి చేస్తున్న నకిలీ నోట్లు ఏమైనా తమకు వచ్చాయా అని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-08-21T06:17:15+05:30 IST