సమస్యలపై కౌన్సిలర్లు గరంగరం
ABN , First Publish Date - 2022-01-01T04:14:32+05:30 IST
మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండాలోని అంశాలను తీర్మానించాక పలువురు కౌన్సిలర్లు సమస్యలపై అధికారులను నిలదీశారు.

అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు
మిషన్ భగీరథ పనులపై సభ్యుల అసంతృప్తి
వాడీవేడిగా మెదక్ మున్సిపల్ సమావేశం
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 31 : మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండాలోని అంశాలను తీర్మానించాక పలువురు కౌన్సిలర్లు సమస్యలపై అధికారులను నిలదీశారు. హరితహారం విషయమై కౌన్సిలర్ సమియొద్దీన్ మాట్లాడుతూ తన కాలనీలో నాటిన మొక్కలకు కంచెను ఏర్పాటు చేయాలని ఆరు నెలలుగా కోరుతున్నప్పటికీ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో తెలియజేసినా అధికారులు స్పందించనపుడు తాను ఎందుకు రావడం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే ఇకపై తాను కౌన్సిల్ సమావేశాలకు హాజరుకానని తేల్చిచెప్పారు. అనంతరం కౌన్సిలర్లు అవారి శేఖర్, మామిళ్ల ఆంజనేయులు, మేడి కల్యాణి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు ఇంకెన్నాళ్లు అసంపూర్తిగా ఉంటాయంటూ అసహనం వ్యక్తం చేశారు. డివైడర్ మధ్యలో నుంచి తీసేసిన సెంటర్ లైటింగ్ పోల్సును బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయించాలని సూచించారు. కొంటూరులో జరిపిన వినాయక నిమజ్జనం ఏర్పాట్ల బిల్లు చెల్లింపులు బల్దియా ఎందుకు చెల్లిస్తుందని వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ ప్రశ్నించారు. గాంధీనగర్ నుంచి అవుసలపల్లి, ఔరంగాబాద్ వరకు డివైడర్ ఏర్పాటు చేయాలంటూ కౌన్సిలర్లు కిషోర్, విశ్వం సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. తమ గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయినప్పటికీ తగిన నిధులు కేటాయించడంలో పాలకవర్గం వైఫల్యం చెందుతుందని అన్నారు. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల నిర్వాహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. తడి, పొడి చెత్త వేరుగా ఇస్తున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది ఒకే చోట కలిపేస్తున్నారని కౌన్సిలర్ మేడి కల్యాణి తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మిషన్ భగరీథ పనులు త్వరలోనే పూర్తిచేయిస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, కౌన్సిలర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
వాయిదా పడిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సుల రీటెండర్
30 ఏళ్లుగా రీ టెండర్ లేకుండా కొనసాగుతున్న మున్సిపల్ షాపింగ్ దుకాణాల గడువు నేటితో ముగియడంతో రీటెండర్ విషయంలో చర్చలు లేవనెత్తారు. దుకాణాలను పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మించాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయగా, మరికొంత మంది యాక్షన్ ప్లాన్ చేసిన తరువాతే కూల్చివేయాలంటూ సభ దృష్టికి తీసుకొచ్చారు. మరికొందరు కౌన్సిలర్లు మాట్లాడుతూ గుడ్‌విల్ ద్వారా ఆదాయాన్ని పొంది షాపింగ్ కాంప్లెక్సులు నిర్మిస్తే బల్దియాకు భారం తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ విషయంపై పూర్తి స్థాయి నివేదిక ఏర్పాటు చేసి మరో ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకుందామని ప్రకటించారు. ఓ వైపు సమస్యలపై కౌన్సిలర్లు ఎవరికి వారు సమావేశం దృష్టికి తీసుకొస్తుండగా, మిగిలిన వారు కబుర్లు చెప్పుకోవడం కనిపించింది. సమావేశంలో చైర్మన్ చంద్రపాల్‌తో పాటు వైస్ చైౖర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కమీషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు ఆవారి శేకర్, ఆర్కే శ్రీనివాస్, మామిళ్ల ఆంజనేయులు, రాగి వనజ, బట్టి లలిత, వంజరి జయరాజ్, కొటాల విశ్వం, కిషోర్, సుంకయ్య, చందన, శంసునీసా భేగం, సులోచన, గోదల మానస, ఆరేళ్ల గాయత్రి, జయశ్రీ, మమత, వేదావతి ఉన్నారు.