సిద్దిపేట: తమ్ముడిపై కౌన్సిలర్ దాడి

ABN , First Publish Date - 2021-08-03T18:23:08+05:30 IST

సిద్ధిపేట: టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగడాలకు అడ్డేలేకుండాపోతోంది.

సిద్దిపేట: తమ్ముడిపై కౌన్సిలర్ దాడి

సిద్ధిపేట: టీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆగడాలకు అడ్డేలేకుండాపోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కౌన్సిలర్లుగా గెలిచిన కొందరు తమ రౌడీయీజాన్ని ప్రదర్శిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా బెదిరిస్తున్నారు. అడ్డం వస్తే దాడులు కూడా చేస్తున్నారు. అయినా వారిపై చర్యలు తీసుకునే నాథుడేకరువయ్యాడు. ఆదివారం రాత్రి సిద్దిపేటలో ఓ వార్డు కౌన్సిలర్ తనకు వరుసకు తమ్ముడయ్యే వ్యక్తిపై కుటుంబసమేతంగా దాడిచేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


సిద్దపేట 26వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ప్రవీణ్, శ్రావణ్‌పై దాడి చేశాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రావణ్ తన స్నేహితులతో కలిసి సెల్ఫీ దిగుతుండగా అటుగా వెళుతున్న కౌన్సిలర్ వారిని దూషించాడు. తన గురించే మాట్లాడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కౌన్సిలర్ కర్రతో శ్రావణ్, అతని స్నేహితులను చితకబాదాడు. కౌన్సిలర్ ఒక్కరే కాదు ఆయన కుటుంబసభ్యులు సయితం దాడికి తెగబడ్డారు. తన అన్నను కొట్టవద్దని వెళ్లిన శ్రావణ్ తమ్ముడిని కూడా కొట్టారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.


ఇటీవల జరిగిన సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ ప్రవీణ్‌పై శ్రావణ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశాడు. అప్పటి నుంచే తనపై ప్రవీణ్ కక్ష గట్టారని శ్రావణ్ ఆరోపించాడు. తనకు ప్రాణహానీ ఉందని, పోలీసులు రక్షించాలని వేడుకున్నాడు. మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Updated Date - 2021-08-03T18:23:08+05:30 IST