పత్తి రైతు చిత్తు

ABN , First Publish Date - 2021-10-29T04:56:54+05:30 IST

పత్తి సాగుచేసిన రైతులు ఆర్థికంగా నష్టపోవల్సి వస్తున్నది. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతిన్నది. పూత, కాత రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మొక్క నీరుపట్టి మోడువారింది. సంగారెడ్డి జిల్లాలో 3,93,150 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. వర్షాలకు 1,15,992 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మిగిలిన పంటకు కూడా భారీగా నష్టం జరిగింది. జిల్లాలో విస్తరించిఉన్న నల్లరేగడి, లాటరైట్‌ నేలల్లో ఎక్కువగా పత్తి సాగుచేస్తారు. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

పత్తి రైతు చిత్తు

వర్షానికి దెబ్బతిన్న పంట   

నాలుగైదు క్వింటాళ్లకు మించని దిగుబడి   

పెట్టుబడి తిరిగిరావడమూ కష్టమే..


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, అక్టోబరు 28: పత్తి సాగుచేసిన రైతులు ఆర్థికంగా నష్టపోవల్సి వస్తున్నది. గత నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతిన్నది. పూత, కాత రాలిపోయి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మొక్క నీరుపట్టి మోడువారింది. సంగారెడ్డి జిల్లాలో 3,93,150 ఎకరాల్లో పత్తి సాగుచేయగా.. వర్షాలకు 1,15,992 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మిగిలిన పంటకు కూడా భారీగా నష్టం జరిగింది. జిల్లాలో విస్తరించిఉన్న నల్లరేగడి, లాటరైట్‌ నేలల్లో ఎక్కువగా పత్తి సాగుచేస్తారు. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి రావడమే గగనంగా మారిందని రైతులు వాపోతున్నారు. పత్తి పంటకు రైతులు భారీగా పెట్టుబడి పెట్టగా.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టిన ఖర్చులు కూడా తిరిగివచ్చేలా కనపించడం లేదు.


ఎకరాకు రూ.35 వేలు పెట్టుబడి 

ఎకరా విస్తీర్ణంలో పత్తి పంటను సాగుచేసేందుకు రూ.35 వేలు ఖర్చవుతుంది. ఎకరాకు రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరం. దుక్కి, ఎరువులు, విత్తనాలు వేసేందుకు, అంతరకృషి, కలుపుతీత, రసాయన మందుల పిచికారీ, చేతికి వచ్చిన పత్తిని తీయడానికి పెద్దమొత్తంలో ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలో ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తేనే రైతుకు గిట్టుబాటవుతుంది. కానీ ప్రస్తుతం ఎకరాకు నాలుగైదు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడంలేదు. దీంతో గతేడాదితో పోల్చితే ధర ఎక్కువగా ఉన్నా రైతుకు గిట్టుబాటు కావడంలేదు. ప్రస్తుతం దళారులు నాణ్యమైన పత్తి క్వింటాలుకు రూ.7,800ల వరకు చెల్లిస్తున్నారు. వర్షంలో తడిసి దెబ్బతిన్న పత్తికి క్వింటాలుకు రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియను చేపట్టలేదు. కానీ ఇదివరకే ప్రభుత్వం పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.6,025లుగా నిర్ణయించింది. 


ఎకరా పత్తి సాగుకయ్యే పెట్టుబడి

రెండు విత్తన ప్యాకెట్లు : రూ.1,600

విత్తనాలు వేసేందుకు కూలీకు : రూ.600

దుక్కి తయారీకి         : రూ.3,500

ఎరువులకు         : రూ.5,000

రసాయన మందులకు : రూ.4,000

మందుల పిచికారీ         : రూ.2,000

పత్తిలో అంతరకృషికి(దంతె) : రూ.2,000

కలుపుతీత         : రూ.4,000

పత్తి తీయడానికి         : రూ.12,000

Updated Date - 2021-10-29T04:56:54+05:30 IST