సిద్దిపేట జిల్లాలో 390 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-05-03T05:06:52+05:30 IST

సిద్దిపేట జిల్లాలో ఆదివారం 390 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది కొవిడ్‌ బారిన పడి మరణించారు.

సిద్దిపేట జిల్లాలో 390 మందికి కరోనా
కిష్టంపేటలో పీపీఈ కిట్లు ధరించి ట్రాక్టర్‌లో రైతు మృతదేహాన్ని తీసుకెళ్తున్న మృతుడి కుమారులు

 తొమ్మిది మంది మృతి


సిద్దిపేట, మే2: సిద్దిపేట జిల్లాలో ఆదివారం 390 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది కొవిడ్‌ బారిన పడి మరణించారు. జిల్లాలో సుమారు 2,200 రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించగా 390 కేసులు నమోదైనట్లు తెలిసింది. సిద్దిపేటలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇద్దరు, పారుపల్లి వీధిలో ఇద్దరు, ప్రశాంత్‌నగర్‌లో ఒకరు, బురుజు సమీపంలో ఒకరు, ఒక పీఈటీ, చేర్యాలలో వ్యాపారి, కొమురవెల్లి మండలం కిష్టంపేటలో రైతు మృతి చెందినట్లు సమాచారం. వైద్యాధికారులు అధికారికంగా వివరాలను వెల్లడించడం లేదు. 


 కరోనాతో చేర్యాలలో వ్యాపారి, కిష్టంపేటలో రైతు మృతి

చేర్యాల, మే 2: చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో కరోనా ప్రభావం కొనసాగుతున్నది. కరోనాతో ఆదివారం మరో ఇద్దరు మృతిచెందారు. చేర్యాలలోని ముని సిపల్‌ కార్యాలయ సమీపంలోని ఓ దుకాణ యాజమానికి ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలో తొలి కరోనా మరణం సంభవించింది. గ్రామానికి చెందిన ఓ రైతు కరోనాతో హోమ్‌ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


కరోనాతో ఎంపీవో మృతి

చిన్నకోడూరు, మే 2: చిన్నకోడూరు మండల ఎంపీవో (56) కరోనాతో మృతి చెందాడు. సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆయనకు కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌ వచ్చింది. కాగా సిద్దిపేట ప్రభుత్వ  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.


 అనంతసాగర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

జగదేవ్‌పూర్‌, మే 2: మండలంలోని అనంతసాగర్‌ గ్రామంలో కరోనా విజృంభిస్తున్న క్రమంలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్టు సర్పంచ్‌ లావణ్యమల్లేశం తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో గ్రామస్థులంతా కలిసి ఆదివారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని, అనవసరంగా ఎవరూ బయటకురావొద్దని సూచించారు. 


Updated Date - 2021-05-03T05:06:52+05:30 IST