సహకార వడ్డీ 12 శాతమే!

ABN , First Publish Date - 2021-03-14T06:53:58+05:30 IST

సహకార వడ్డీ 12 శాతమే!

సహకార వడ్డీ 12 శాతమే!
డీసీసీబీ ఇచ్చిన రూ.4 లక్షల ప్రోత్సాహక చెక్కును జిల్లా మహిళా సమాఖ్యకు అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి (ఫైల్‌)

సంగారెడ్డి జిల్లా మహిళలకు 0.5 శాతం తక్కువకే రుణాలు

5 శాతం వడ్డీ తిరిగి మహిళలకే ఇస్తున్న బ్యాంకు

మహిళా ప్రగతికి డీసీసీబీ తోడ్పాటు

మంత్రి హరీశ్‌ ఆదేశాలతో అమలు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, మార్చి 13: సంగారెడ్డి జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకు మహిళా సాధికారతకు తనవంతుగా సహకారం అందజేస్తున్నది. మహిళా సమాఖ్యకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీని 12.50 శాతంగా ప్రభుత్వం నిర్ణరుచింది. కానీ ఉమ్మడి మెదక్‌జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకు 12 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తున్నది. అంతేకాకుండా 5 శాతం వడ్డీని తిరిగి మహిళా సమాఖ్యకు ప్రోత్సాకంగా అందజేస్తున్నది. రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో కూడా ఈ పథక అమలు కావడం లేదు. కేవలం సంగారెడ్డి జిల్లాలో మాత్రమే మహిళల ప్రగతి కోసమే సహకార కేంద్ర బ్యాంకు ఈ పథకాన్ని అమలు చేయడం విశేషం. ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచన మేరకు సహకార కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నది.


మంత్రి హరీశ్‌ సూచనతో..

సంగారెడ్డిలో గత ఏడాది మే 27న జరిగిన ఉమ్మడి మెదక్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు హాజరయ్యారు. మహిళా సంఘాలకు విరివిగా అప్పులు ఇవ్వాలని, తక్కువ వడ్డీ వసూలు చేయాలని, ఎటువంటి ఛార్జీలు తీసుకోవద్దని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా అప్పులు ఇచ్చి, వసూలైన వడ్డీలో కొంత ప్రోత్సహకంగా జిల్లా మహిళా సమాఖ్యకు ఇవ్వాల్సిందిగా హరీశ్‌రావు సూచించారు. ఈమేరకు మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై 12.50 శాతం ఉన్న వడ్డీని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 12 శాతానికి తగ్గించాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ రకంగా చెల్లించిన వడ్డీలో 5 శాతం మొత్తాన్ని తిరిగి జిల్లా మహిళా సమాఖ్యకు పోత్సాహకంగా అందజేయాలని తీర్మానించింది.

రూ.64.98 కోట్ల రుణాలు 

జిల్లాలోని మహిళా సంఘాలకు గతేడాది జూన్‌ 30 వరకు రూ.64.98 కోట్లను రుణాలను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందజేసింది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు మరో రూ.37.64 కోట్ల రుణాలిచ్చింది. దీంతో ఏడాదిలో మహిళా సంఘాలకే రూ.102.57 కోట్ల రుణాలను జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అందజేసింది. ఈ మొత్తాన్ని సకాలంలో వడ్డీతో సహా తిరిగి చెల్లించాయి. దీంతో ప్రోత్సాహకంగా నాలుగు లక్షల రూపాయలను జిల్లా మహిళా సమాఖ్యకు సహకార కేంద్ర బ్యాంకు తిరిగి ఇచ్చింది. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా చెక్కును అందజేశారు.


మహిళల అభ్యున్నతికి ప్రోత్సాహకం

మహిళా సంఘాలు రుణాలను సద్వినియోగం చేసుకుని, సకాలంలో తిరిగి చెల్లిండం కోసమే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రోత్సాహకం అందజేస్తున్నది. ఇలా ఇచ్చిన నిధులను జిల్లా, మండల, గ్రామ మహిళా సమాఖ్యల నిర్వహణ, మహిళల అభ్యున్నతికి ఉపయోగిస్తున్నారు. బ్యాంకు తిరిగి ఇస్తున్న 5 శాతం పోత్సాహకంలో 2 శాతం చొప్పున డబ్బులను గ్రామ, మండల మహిళా సమాఖ్యలకు జిల్లా మహిళా సమాఖ్య ఇస్తున్నది. మిగిలిన ఒక శాతం జిల్లా మహిళా సమాఖ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నది.

Updated Date - 2021-03-14T06:53:58+05:30 IST